Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యంగ్ హీరోలు… ప్రేమ కథలు, కుటుంబ కథాచిత్రాలు, యాక్షన్ మూవీస్ ఎంచుకుంటోంటే..దగ్గుబాటి రానా మాత్రం వారికి భిన్నంగా తన కెరీర్ ను మలుచుకుంటున్నాడు. కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యభరిత పాత్రలు పోషిస్తున్న రానా…ప్రస్తుతం పీరియాడిక్ సినిమాలపై దృష్టిపెట్టాడు. ఈ కోవలో గతలో ఘాజీలో నటించిన రానా ఆ సినిమాతో మంచి విజయాన్ని దక్కించుకున్నాడు. ఇప్పుడు 1945 చిత్రంలో నటిస్తున్నాడు. రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంగా సాగే ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ సాగుతుండగానే మరో పీరియాడిక్ చిత్రంలో నటించేందుకు అంగీకరించాడు. కేరళలోని ట్రావెన్ కోర్ ప్రాంతానికి చెందిన మహారాజ తిరునాళ్ మార్తాండవర్మ జీవితం ఆధారంగా మహారాజ మార్తాండవర్మ అనే సినిమా రాబోతోంది. ఈ చిత్రంలో మార్తాండవర్మగా రానా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని రానానే స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించాడు. అనిళం తిరునాళ్ మార్తాండవర్మ- ది కింగ్ ఆఫ్ ట్రావెన్ కోర్ చిత్రంతో రాబోతున్నానని , ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని ట్వీట్ చేశారు. రాబిన్ తిరుమల కథ అందించిన మార్తాండవర్మకు కె. మధు దర్శకత్వం వహించనున్నారు. మొత్తానికి సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ…రానా సినీ ప్రయాణం కమర్షియల్ హీరో ఫార్ములాకు దూరంగా సాగుతోంది.