Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రస్తుతమున్న యువహీరోల్లో రానాది ఓ ప్రత్యేకస్థానం. మిగిలిన హీరోల్లా కొన్ని పాత్రలకే పరిమితం కాకుండా…విభిన్నతకు పెద్ద పీట వేస్తూ రానా ముందుకుపోతున్నాడు. అలాగే బహుభాషా చిత్రాల్లో నటిస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. తొలి నుంచీ తెలుగు సినిమాలతో పాటుగా హిందీ సినిమాల్లోనూ నటిస్తూ వచ్చిన రానా ఇప్పుడు హాలీవుడ్ లో ప్రవేశిస్తున్నాడు. తెలుగు నుంచి హాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్న హీరోల్లో రానానే మొదటివాడు. బాహుబలి 2 విడుదలైన కొన్ని రోజులకే రానాకు హాలీవుడ్ ఆఫర్ వచ్చిందన్న వార్తలొచ్చాయి. ఈ లోపు రానా తెలుగులో నేనే రాజు నేనే మంత్రి సినిమా చేసి విజయాన్ని అందుకున్నాడు. తర్వాత యువహీరోలు ఎవరూ చేయని విధంగా డిజిటల్ మీడియాలోకీ ప్రవేశించాడు. సోషల్ అనే వెబ్ సిరీస్ లో కీలక పాత్ర పోషించాడు.
బుల్లితెరపైనా ఓ కార్యక్రమానికి యాంకరింగ్ చేస్తున్న రానా… ఇక హాలీవుడ్ మూవీ షూటింగ్ లో పాల్గొనేందుకు రెడీ అయ్యాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఓ వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. 1888వ సంవత్సరంలో 700 మంది ప్రయాణికులతో ఓ భారీ ఓడ సౌరాష్ట్ర నుంచి బయలుదేరింది. అయితే అది గమ్యస్థలం చేరకుండానే మార్గమధ్యంలో అదృశ్యమయింది. ఈ ఘటననే కథాంశంగా తీసుకుని సినిమాను రూపొందిస్తున్నారు. ఓడ ఏమయింది? దాని అదృశ్యానికి గల కారణాలేంటి అన్న విషయాలపై పరిశోధన చేసే సైంటిస్టు పాత్రలో రానా కనిపించనున్నాడు. సినిమాకు విజిల్ అనే టైటిల్ ఖరారుచేశారు. ఈ సినిమా తర్వాత రానా హాలీవుడ్ లో బిజీ అవటం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు.