మహాత్మాగాంధీ అరుదైన చిత్రం అమెరికాలో రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ఆ ఫొటోలో మహాత్ముడు మదన్ మోహన్ మాలవ్యతో కలిసి నడుస్తున్నారు. ఫొటోపై ఎం.కె. గాంధీ అని ఫౌంటెయిన్ పెన్ తో సంతకం చేసి ఉంది. ఫొటో వేలంలో 41,806 డాలర్లు అంటే సుమారు రూ. 27లక్షలు పలికింది. బోస్టన్ కు చెందిన ఆర్ ఆర్ వేలం సంస్థ ఈ వేలం నిర్వహించింది. 1931 సెప్టెంబరులో రెండో రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం తీసిన ఫొటో ఇదని ఆ సంస్థ తెలిపింది.
లండన్ లో 1930 నుంచి 1932 మధ్య బ్రిటిష్ ప్రభుత్వం మూడుసార్లు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశాలకు భారతీయ నేషనల్ కాంగ్రెస్ తరపున గాంధీజీ హాజరయ్యారు. గాంధీ ఈ ఫొటోపై సంతకం చేసిన సమయంలో కుడిచేతి బొటనవేలు నొప్పితో బాధపడుతున్నారని, 1931 ఆగస్టు 8 నుంచి డిసెంబర్ 19వరకు ఎడమచేతితోనే రాశారని, ఆ సమయంలోనే ఈ ఫొటోపై సంతకం చేశారని ఆర్ ఆర్ వేలం ప్రకటించింది. ఈ సంస్థ ఫిబ్రవరి 17 నుంచి మార్చి 7వరకు పలువురు ప్రముఖుల ఉత్తరాలు, ఆటోగ్రాఫ్ లు, కళాకృతులను వేలం వేసింది. ఈ వేలంలో కార్ల్ మార్క్స్ రాసిన ఓ ఉత్తరం 53,509డాలర్లకు అమ్ముడుపోయింది.