Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రెండు సంవత్సరాల విరామం తర్వాత మాస్ మహరాజా రవితేజ నటించిన రాజా ది గ్రేట్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగా ట్రైలర్ కు విశేషమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంలో రవితేజ అంధుడిగా నటిస్తుండడం అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. సినిమా రిలీజ్ కు ముందే రాజా ది గ్రేట్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. రాజా ది గ్రేట్ లాంటి సినిమా ఇప్పటివరకూ రాలేదని ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆయన ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించారు. హీరో పాత్రతో పాటు సినిమాలోని అన్ని క్యారెక్టర్లను దర్శకుడు అనిల్ రావిపూడి మలచిన తీరు అద్భుతమని రాజేంద్రప్రసాద్ కొనియాడారు.
కథానాయకులను అంధులుగా చూపిస్తూ గతంలో అనేక సినిమాలు వచ్చాయని, కానీ రాజా ది గ్రేట్ వాటికి పూర్తి భిన్నమైన చిత్రమని ఆయన చెప్పారు. ఇప్పటి పరిణామాల్లో హీరోను అంధుడిగా చూపిస్తూ పెద్ద కమర్షియల్ మూవీ తీయడం నిజంగా సాహసమేనని అన్నారు. 20 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్న తాను ఎన్నో సినిమాలు చూశానని, కానీ రాజా ది గ్రేట్ లాంటి మూవీ తెలుగులోనే కాదు… ఏ ఇతర భాషల్లోనూ రాలేదని రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. హీరో రవితేజ కూడా దర్శకుడు అనిల్ రావిపూడి పనితీరును ప్రశంసించారు.
దర్శకుడు సినిమాను అద్భుతంగా తెరకెక్కించడాని చెప్పారు. రాజేంద్రప్రసాద్, రాధిక వంటి సీనియర్స్ తో ఈ సినిమాలో కలిసి నటించడం చాలా సంతోషం కలిగించిందన్నారు. హీరోయిన్ మెహ్రీన్ పైనా రవితేజ ప్రశంసల వర్షం కురిపించారు. మెహ్రీన్ అంకితభావం చూస్తే తనకు చాలా ఆశ్చర్యం వేసిందని, మరో రెండు సినిమాలు చేసేసరికి ఆమె తెలుగు పూర్తిగా నేర్చేసుకుంటుందని రవితేజ చెప్పారు. గ్లామర్ తో పాటు మంచి నటనాసామర్థ్యం ఉన్న మెహ్రీన్ హవా మొదలైందని, తెలుగులో ఆమె జెండా పాతేయడం ఖాయమని అన్నారు. దిల్ రాజు చెప్పినట్టుగా ఈ సినిమా ఘనవిజయం సాధిస్తుంనది ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. అక్టోబరు 19న దీపావళి కానుకగా రాజా ది గ్రేట్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.