శ్రీవారి తిరువాభరణాలు తరలిపోయాయంటూ టీడీపీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కొద్దిరోజుల నుండి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీటీడీ. నిన్న స్వామీ వారి నగలను ప్రదర్శనకు ఉంచింది. ఈ సందర్భంగా రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని బోర్డు సభ్యులు తేల్చేశారు. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు సోమవారం టీటీడీ చరిత్రలోనే తొలిసారిగా పాలక మండలి సభ్యుల కోసం శ్రీవారి ఆభరణాలను ప్రదర్శించారు. బోర్డు సభ్యులు వీటిని పరిశీలించారు. ఆభరణాల పరిశీలన అనంతరం బోర్డు సభ్యులు మీడియాతో మాట్లాడారు. రమణ దీక్షితులు చెబుతున్న పింక్ డైమండ్ అసలు లేనే లేదని పేర్కొన్నారు. రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ, పింక్ డైమండ్ అనేది ఒకవేళ ఉండి ఉంటే రమణ దీక్షితులు ప్రధాన అర్చకుడిగా ఉన్న సమయంలో దానిని ఆయనే కాజేసి ఉండొచ్చని ఆరోపించారు.
తిరుమల శ్రీవారి ఆభరణాల్లోని రూబీ ఒకటి పగిలిపోయిందని, దాని విలువ రూ. 50గా రికార్డులో నమోదు చేసి ఉందని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ చెప్పారు. అలాగే శ్రీవారి ఆభరణాల విషయంలో వస్తున్న ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిన్న అమరావతిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై ప్రతి రెండేళ్లకోసారి శ్రీవారి నగలపై ప్రత్యేక కమిటీతో న్యాయ విచారణ చేపడతామని సీఎం ఈ సందర్భంగా ప్రకటించారు. ఆ కమిటీ ముందే ప్రతి రెండేళ్లకోసారి నగల పరిశీలన చేస్తామని, అదే విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. శ్రీవారికి ఆగమ శాస్త్రం ప్రకారమే అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. కొంతమంది లేని నగలు, డైమండ్లు పోయాయంటూ రాజకీయాలు చేస్తున్నారని పరోక్షంగా రమణ దీక్షితులు ఆరోపణలపై మండిపడ్డారు.