దేశంలో విగ్రహాల ధ్వంసం పేరుతో కొత్త రాజకీయాలు తెరపైకి వచ్చాయి. త్రిపురలో బీజేపీ అధికారంలోకి వచ్చిన కొన్ని గంటలకే రష్యా కమ్యూనిస్టు నేత వ్లాదిమర్ లెనిన్ విగ్రహాన్ని కూల్చివేయడం దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు కలిగించింది. రెండున్నర దశాబ్దాల కమ్యూనిస్టుల పాలనకు చరమగీతం పాడిన ఉత్సాహంలో ఉన్న బీజేపీ… అధికార మదంతోనే లెనిన్ విగ్రహాన్ని కూల్చివేసిందని వామపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన తర్వాత త్రిపురలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఇది జరిగిన కొన్ని గంటలకే బీజేపీ నేత హెచ్ రాజా ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ చేశారు. ఇవాళ త్రిపురలో లెనిన్, రేపు కుల తీవ్రవాది రామస్వామి నాయకర్ అని పోస్ట్ చేశారు. రాజా ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటలకే తమిళనాడులోని వెల్లూర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో ఉన్న పెరియార్ విగ్రహాన్ని కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటన తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. వెంటనే స్పందించిన పోలీసులు భారీ భద్రత ఏర్పాటుచేయడంతో పాటు ఘటనకు కారణంగా బావిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
రామస్వామి నాయకర్ విగ్రహం కళ్లు, ముక్కు దెబ్బతిన్నాయని, ఓ బీజేపీ కార్యకర్త, ఓ సీపీఐ కార్యకర్త మద్యం మత్తులో ఈ పనిచేశారని పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటన నేపథ్యంలో రాజా స్పందించారు. ఆ పోస్టు తాను చేయలేదని, ఎవరు చేశారో తెలియదని, పోస్ట్ గురించి తెలియగానే వెంటనే డిలీట్ చేశానని తెలిపారు. దీనిపై ఆందోళన కొనసాగుతుండగానే… బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే తృణమూల్ కాంగ్రెస్ అదికారంలో ఉన్న కోల్ కతాలోనూ ఈ తరహా ఘటనే చోటుచేసుకుంది. కోల్ కతాలో నిత్యమూ బిజీగా ఉండే కాళిఘాట్ ప్రాంతంలో ఉన్న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు కూల్చేశారు. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన విగ్రహాల కూల్చివేతపై ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తంచేశారు.
కేంద్ర హోం శాఖ అధికారులతో దీనిపై చర్చించిన ప్రధాని… ఇలాంటి ఘటనలు ఆమోదయోగ్యం కావని హెచ్చరించారు. ఈ ఘటనల గురించి పూర్తి వివరాలు తెలుసుకుని వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ ఘటనలను హోంశాఖ కూడా సీరియస్ గా తీసుకుందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, వీటిపై ఇప్పటికే ఆయా రాష్ట్రాలతో చర్చలు జరిపామని అధికారులు తెలిపారు. అటు విగ్రహాల ధ్వంసంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలన్నీ పరిశీలిస్తే… త్రిపురలో లెనిన్ విగ్రహం… తమిళనాడులో పెరియార్ విగ్రహం కూల్చివేసింది బీజేపీ అన్న అనుమానాలు కలుగుతున్నాయి కానీ… ఇందులో మరో కోణం లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వరుస విజయాలతో దూసుకుపోతున్న బీజేపీని దెబ్బతీయడానికి కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి… ఇలా తమ అనుకూల విగ్రహాలు కూల్చివేయడం ద్వారా ఆ నేరాన్ని బీజేపీపైకి తోసి… ప్రజలముందు ఆ పార్టీని దోషిగా నిలబెట్టే వ్యూహం రచించాయని కొందరు విశ్లేషిస్తున్నారు.