Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కేరళను వణికిస్తూ… హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయిన నిఫా వైరస్ కు గబ్బిలాలు కారణమని ఇప్పటిదాకా అందరూ అనుకుంటున్నారు. అయితే గబ్బిలాలకు నిర్వహించిన వైద్యపరీక్షల్లో ఇది నిజం కాదని తేలింది. కేరళలో నిఫా కారణంగామొట్టమొదట మరణించిన సబిత్ కు ఆయన ఇంటిలోని బావిలో ఉన్న గబ్బిలాల ద్వారా వైరస్ సోకిందని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ బావిని కప్పివేశారు కూడా. పరిశోధన కోసం బావిలోని కొన్ని గబ్బిలాల నుంచి రక్తం, ఇతర నమూనాలను సేకరించి భోపాల్ లోని జంతువ్యాధుల పరీక్షా కేంద్రానికి పంపించారు.
మొత్తం 21నమూనాలను గబ్బిలాలతో పాటు ఇతర జంతువుల నుంచి సేకరించి పంపారు. అందులో మూడు నమూనాలు పురుగులు తినే గబ్బిలాలవి. వీటిపై పరీక్షలు జరిపిన వైద్యులు ఆ మూడు గబ్బిలాలలో నిఫా వైరస్ కారకాలు లేవని తేల్చారు. భోపాల్ జంతు వైద్యుల నిర్ధారణతో వైరస్ ఎలా సోకిందన్నదానిపై అయోమయం ఏర్పడింది. దీంతో పూణె వైరాలజీ ఇన్ స్టిట్యూట్ నిపుణులు ఆదివారం కేరళలోని వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అసలు కారణాలు గుర్తించే ప్రయత్నం చేయనున్నారు. పండ్లను తినే గబ్బిలాల నుంచి నమూనాలు సేకరించనున్నారు.