ఎట్టకేలకు రేణు దేశాయ్ ఇంకో పెళ్లి ద్వారా వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టబోతోంది. ఈ విషయంలో ఎవరి అభిప్రాయాలు వారివి. కానీ ఆ అభిప్రాయాల కన్నా ఆమె జీవితం ఎలా నడుపుకోవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ రేణుకి వుంది. అయితే అంత కన్నా పెద్ద నిర్ణయం ఆమె ఇంకోటి తీసుకుంది. అదే ట్విట్టర్ నుంచి వైదొలగడం. అంత చిన్న విషయాన్ని పెద్ద విషయం గా ఎలా అనుకుంటారు అని చాలా మంది అనుకోవచ్చు. కానీ కాస్త లోతుగా ఆలోచిస్తే అది చాలా పెద్ద విషయం. సమాజంలో సంకుచిత ధోరణులకు అద్దం పట్టిన నిర్ణయం.
రేణు దేశాయ్ ఆషామాషీ అమ్మాయి ఏమీ కాదు. తాను ప్రేమించిన మనిషి కోసం సామాజిక కట్టుబాట్లని తెంచుకుని సహజీవనం చేసిన వ్యక్తి. అందుకు ఎంత ధైర్యం కావాలి?. అలాగే పిల్లల్ని కనడానికి ఇంకెంత ధైర్యం కావాలి ?. సరేలే అనుకుంటే తాను సహజీవనం చేసిన వ్యక్తి తన కోసం కాకుండా రాజకీయ అవసరాల కోసం హఠాత్తుగా పెళ్లి చేసుకుందామంటే ఒప్పుకోడానికి ఎంత నలిగిపోయివుండాలి?. తన పెళ్ళికి రాజకీయ అవసరాలు కారణం అన్న చేదు వాస్తవాన్ని జీర్ణించుకుని ఆ మనిషితో నవ్వుతూ జీవితం కొనసాగించడానికి ఎంత సహనం కావాలి ?. ఇంతా చేస్తే ఆ బంధం విడాకులకు దారి తీసినప్పుడు రెండో వ్యక్తిని ఒక్క మాట అనకుండా పిల్లలతో సహా బయటకు రావడానికి ఇంకెంత సహనం కావాలి ?. తనకు తీరని వేదన మిగిల్చిన మనిషి ని అభిమానించే వాళ్ళు లక్షల్లో వున్నారని తెలిసి , వారి ముందు ఆ మనిషిని చులకన చేయకూడదని సమయంనంతో ఉండడానికి ఎంత పరిణితి కావాలి. తనను కాదనుకున్న వ్యక్తి ని అభిమానించేవాళ్ళు తన వ్యక్తిగత జీవితాన్ని , నిర్ణయాల్ని ప్రభవితం చేయడానికి , వేలెత్తి చూపడానికి ప్రయత్నం చేస్తుంటే వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నం చేశారంటే ఆమె సహనాన్ని ప్రశ్నించగలమా?.
ఇలా టీనేజ్ లో ప్రేమ వల్ల ఇన్ని సవాళ్ళను ఎదుర్కొన్న రేణు ట్విట్టర్ నుంచి వెళ్లిపోవడం చూసి కొందరు జబ్బ చరుచుకుంటున్నారు. ఇంకొందరు కాలర్లు ఎగురవేస్తున్నారు. కానీ వారిని చూసి కాదు రేణు వెనకడుగు వేసింది. ఇద్దరు పిల్లలతో ఒంటరి జీవితం గడపడం కష్టం అని తెలిసి తోడు కోసం పెళ్లి చేసుకుంటే చాలా మంది ఆడవాళ్లు ఆ నిర్ణయాన్ని తప్పు పట్టడంతో ఆమె బాగా హర్ట్ అయ్యారట. మగవాళ్ళు , సినిమా మోజులో వుండే కుర్రోళ్ళు ఏదో మాట్లాడారు అనుకుకోవచ్చు గానీ సాటి ఆడవాళ్లు కూడా తన నిర్ణయాన్ని ప్రతికూలంగా తీసుకోవడాన్ని ఆమె భరించలేకపోయారట. అందుకే ఇంత నెగటివిటీ వున్న ట్విట్టర్ లో ఉండడం ఎందుకని ఆమె నిష్క్రమించారు. ఈ ఉపసంహరణ ఆమెకి ప్రశాంతత ఇవ్వచ్చేమో గానీ సమాజంలో ప్రబలుతున్న అశాంతికి ఇదో మచ్చుతునక. నిజానికి ట్విట్టర్ కి దూరమైన రేణు దేశాయ్ ఓడి గెలిచింది. ఆమెని ఆ నిర్ణయం వైపు నెట్టిన వాళ్ళు గెలిచి ఓడిపోయారు.