అసలు దోషి ఫిజియోథెరపిస్ట్

అసలు దోషి ఫిజియోథెరపిస్ట్

ఐపీఎల్ 2020 సీజన్‌లో మ్యాచ్ ఆడుతూ రోహిత్ శర్మ తొడ కండరాలకి గాయం కావడంతో అతడ్ని ఎంపిక చేయలేదని తెలుసుకున్న అభిమానులు నిరాశచెందారు. కానీ.. భారత సెలక్టర్లు టీమ్‌ని ప్రకటించిన గంట వ్యవధిలోనే రోహిత్ శర్మ నెట్స్‌లో మునుపటి తరహాలో బంతిని బలంగా హిట్ చేస్తూ కనిపించాడు. దాంతో.. తొడ కండరాల గాయంతో ఉన్న ఆటగాడు నెట్స్‌లో ప్రాక్టీస్ ఎలా చేయగలడు..? రోహిత్ శర్మ గాయంపై కాస్త పారదర్శకంగా స్పష్టత ఇవ్వండి అని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. భారత సెలెక్టర్లకి మొట్టికాయలు వేశాడు. దాంతో.. గవాస్కర్ బాటలోనే అభిమానులు కూడా సోషల్ మీడియాలో రోహిత్ శర్మ గాయంపై క్లారిటీ కోసం ప్రశ్నల వర్షం కురిపించారు.

రోహిత్ శర్మ గాయం, ఫిట్‌నెస్‌పై దుమారం రేగడంతో భారత సెలక్టర్లు, బీసీసీఐ దిద్దుబాటు చర్యలకి దిగింది. అసలు సమస్య ఎక్కడ వచ్చింది..? అని ఆరా తీయగా.. టీమిండియా ఫిజియోథెరపిస్ట్ నితిన్ పటేల్ దోషిగా తేలాడు. భారత సెలక్టర్లు టీమ్‌ని ఎంపిక చేసే ముందు ఆటగాళ్ల ఫిట్‌నెస్ రిపోర్ట్‌లను ఇవ్వాల్సిందిగా నితిన్ పటేల్‌ని ఆదేశించగా.. అతను రోహిత్ శర్మ ఫిట్‌నెస్ రిపోర్ట్‌లో కనీసం 2-3 వారాలు రెస్ట్ అవసరమని అందులో రాశాడు. దాంతో.. టీమ్ సెలక్షన్ సమయంలో రోహిత్ శర్మ పేరుని సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు.

రోహిత్ శర్మ‌ని పక్కన పెట్టడంపై చెలరేగిన వివాదంపై బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘‘నితిన్ పటేల్ టీమిండియా ఆటగాళ్ల ఫిట్‌నెస్ గురించి సెలక్టర్లకి పూర్తి స్థాయి రిపోర్ట్ సమర్పించాడు. సాధారణంగా టీమ్ ఎంపికకి ముందు బీసీసీఐ, సెలక్టర్లకి ఫిజియో ఈ రిపోర్ట్ ఇస్తుంటాడు. తాజాగా రోహిత్ శర్మ గాయంపై ఇద్దరు డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికెట్‌ని ఫిజియో సమర్పించగా.. అందులో ఇద్దరూ రోహిత్ శర్మకి 2-3 వారాలు విశ్రాంతి అవసరమని సూచించారు. దాంతో.. రోహిత్‌ని టీమ్‌లోకి సెలక్టర్లు ఎంపిక చేయలేదు’’ అని వెల్లడించాడు.