Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సంక్రాంతి… మూడు రోజుల పాటు చేసుకునే పండుగ. పండుగ ముందు రోజు భోగి, పండగ తర్వాత రోజు కనుమ జరుపుకోవడం ఎలా ఆనవాయితీగా వస్తుందో, కనుమ రోజు ప్రయాణం వద్దని చెప్పడం కూడా అంతే ఆనవాయితీగా వస్తోంది. ఇలా చెప్పడం వెనుక అసలు కారణం తెలిస్తే కోడి పందేల పేరిట అవి కొట్టుకు చస్తుంటే ఆ హింసలో వినోదం చూడరు.
మన పల్లె జీవనం లో వ్యవసాయం ఎంత ముఖ్యమో దాని సాగు, ఇతర అవసరాలు తీర్చే జంతువులు అంతే అవసరం. అలా గుర్తించి పాడిపంటలు కోసం ఆవులు, బర్రెలు, వ్యవసాయం, ప్రయాణాల కోసం ఎద్దులు, దున్నపోతులను రైతులు దగ్గరికి తీస్తారు. వాటితో పాటే కుక్కలు, పిల్లులు, కోళ్లు, మేకలు, గొర్రెలని కూడా మరికొందరు మాలిమి చేస్తారు. ఇంటి మనిషుల్లాగే వాటిని కూడా ప్రేమగా చూసుకోవడం రైతు ఇళ్లలో సహజం. సంక్రాంతికి కొత్త పంట ఇంటికి వస్తుంది. ఆ పంట పండించడంలో సాయం చేసే జంతువులకు వాటి శ్రమకు తగ్గ విధంగా గౌరవించే రోజు కనుమ. ఆ రోజు పశువులకు పూజలు చేస్తారు. ఆ ఒక్క రోజు అయినా వాటికి శ్రమ కలగకుండా చూడాలన్న భావముతో బండ్లు కట్టకుండా చూసేందుకు ఆ రోజు ప్రయాణమే వద్దని చెబుతారు. (ఆ రోజుల్లో ప్రయాణాలకు ఎడ్ల బండ్లు వాడేవాళ్లు). శ్రమైక జీవనంలో తనకు సహకరిస్తున్న నోరు లేని జీవానికి రైతు ఇచ్చే గౌరవం, స్థానం అది. దాన్ని ఏ మాత్రం అర్ధం చేసుకున్నా ఇప్పుడు వినోదం పేరిట కోళ్లకు కత్తులు కట్టి అవి ప్రాణాలు తీసుకుంటుంటే చూసే వాళ్ళు కొందరైనా మారతారు.