ఎన్నాళ్ళకెన్నాళ్ళకి…వైసీపీ అధినేత జగన్ కి తల్లి , చెల్లి గుర్తొచ్చారు. 2014 ఎన్నికల తర్వాత వైసీపీ పెద్ద ఎత్తున జరుపుతున్న ఓ రాజకీయ కార్యక్రమానికి జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల హాజరు కావడం ఇదే తొలిసారి. ఈ పరిణామం సామాన్య జనానికి మాత్రమే కాదు, వైసీపీ శ్రేణులకు కూడా పెద్ద షాక్. వచ్చే ఎన్నికల నాటికి విజయమ్మ, షర్మిల ని పక్కనబెట్టి భార్య భారతిని రంగంలోకి దించుతారని జగన్ గురించి తెలిసిన వైసీపీ నేతలు భావించారు. కానీ అనూహ్యంగా వైసీపీ ప్లీనరీ లో విజయమ్మ, షర్మిల ప్రత్యక్షమయ్యారు. ఈ హఠాత్ పరిణామానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటో అని ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి.
వాడుకుని వదిలేస్తాడు అని సీఎం చంద్రబాబు గురించి ప్రతిపక్ష నేత జగన్ పదేపదే చేసే విమర్శ. బతికి వున్నప్పుడు వై.ఎస్ ఇలాగే అనేవారు. దాన్ని జగన్ అలాగే కొనసాగించారు. అయితే ప్రశాంత్ కిషోర్ టీం క్షేత్ర స్థాయిలో జరిపిన సర్వే లో చంద్రబాబు తో పోలిస్తే జగన్ విశ్వసనీయత బాగా తక్కువగా ఉందట. ఈ సర్వే లో పాల్గొన్న ఎక్కువ మంది ఒకప్పుడు వై.ఎస్ కి అండదండగా నిలిచిన నాయకులెవ్వరూ జగన్ తో కలిసి నడవకపోవడాన్ని ప్రస్తావించారట. ఈ కోవలో కేవీపీ, సబ్బం హరి, ఉండవల్లి లాంటి వాళ్ళ పేర్లతో పాటు అసలు తల్లి,చెల్లిని ఎన్నికలు కాగానే పక్కనబెట్టారని చెప్పారట. ఈ ఫలితాలు చూసి కంగుతిన్న ప్రశాంత్ కిషోర్ స్వయంగా ఈ విషయం జగన్ చెవిన వేసి తప్పు దిద్దుకోవాలని సూచించారట. దీంతో ఇష్టమున్నా,లేకున్నా జగన్ మళ్లీ తల్లి,చెల్లిని పిలిచారట.వాళ్ళు కూడా ఎన్ని ఇబ్బందులున్నా పెద్ద మనసుతో ప్లీనరీకి వచ్చారట.