మనసులో కలిగిన భావాలను రాతగా మార్చే శక్తి, సామర్ధ్యం రేణు దేశాయ్ సొంతం. ఆమె రాసిన కొన్ని కవితలు బయటకు రావడంతో ఆమె సృజనాత్మకత ప్రపంచానికి తెలిసొచ్చింది. అందుకేనేమో సోషల్ మీడియాలో కూడా ఆమె పెట్టే పోస్టింగ్స్ ఇంటరెస్టింగ్ గా ఉంటాయి. చిన్న చిన్న విషయాల మీద కూడా లోతైన చర్చ జరిగేలా చేస్తాయి. పవన్ తో దూరం జరిగినప్పటినుంచి రేణు తన మనసులో భావాలు పంచుకోడానికి ట్విట్టర్ ని వేదికగా చేసుకున్నారు. ఆమె ట్వీట్స్ కి పెద్ద ఎత్తున పవన్ ఫాన్స్ రిప్లై ఇచ్చేవాళ్ళు. పవన్ కి అనుకూలంగా మాట్లాడినంతసేపు అంతా బాగుంది. ఏదైనా నెగటివ్ విషయం చెప్పాల్సిన అవసరం వస్తే సీన్ మారిపోయేది. చివరకు ఆమె రెండో పెళ్లి విషయంలోనూ అంతే జరిగింది. రేణు ని రెండో పెళ్లి చేసుకోవద్దని గోల చేసిన వాళ్ళు చాలా మందే వున్నారు. అలా వ్యవహరించడం మంచిది కాదని రేణు ఎన్నో సార్లు చెప్పి చూసింది. ట్విట్టర్ ద్వారానే ఒంటరి మహిళలు, సింగల్ పేరెంట్ ఎదుర్కొనే సమస్యలు వివరించినా పరిస్థితుల్లో పెద్ద మార్పు కనిపించలేదు. ఈ విషయంలో ప్రయత్నం చేసి చేసి అలసిపోయింది.
సోషల్ మీడియాలో సెలెబ్రెటీల మీద నెగటివ్ కామెంట్స్ పెట్టే వారిని మార్చడం తన వల్ల కాదని రేణు దేశాయ్ కి అర్ధం కావడానికి చాలా ఏళ్ళు పట్టింది. ఇంకా ఇలా ప్రతికూల భావనల మధ్య నలిగిపోయేవారితో ఉండడం మంచిది కాదని ఆమె ఓ నిర్ణయానికి వచ్చింది. అందుకే రెండో పెళ్లి వంటి పెద్ద నిర్ణయంతో పాటు తన మనసు ప్రశాంతంగా ఉంచుకునే ఇంకో నిర్ణయం కూడా తీసుకుంది. అదే ట్విట్టర్ నుంచి తప్పుకోవడం. ఇదేదో సాధారణ వ్యవహారం లాగా మనకు అనిపించొచ్చు. కానీ కాదు. ఓ హీరోయిన్ గా , ఓ భారీ ఇమేజ్ ఉన్న నటుడికి భాగస్వామిగా వ్యవహరించిన ఆమె ఆపై వ్యక్తిగత జీవితంలో వచ్చిన సవాళ్ళను సమర్ధంగా ఎదుర్కొన్నారు. ఏ ఒక్కసారి ఆమె దురుసుగా మాట్లాడలేదు. అయితే తమ జీవితాల్లో వచ్చిన మార్పుకి అభిమానుల అంతులేని వ్యక్తిపూజ కూడా ఓ కారణం అని ఆమె గ్రహించారు. ముందు ఆ వ్యక్తిపూజ లేకుండా చూడాలని ట్విట్టర్ ద్వారా ఆమె చాలా ప్రయత్నాలే చేశారు. సినీ నటుల మీద అభిమానం అంటే మానసిక చైతన్యం లేని వ్యక్తి పూజ కాకూడదని రేణు భావించారు. ఆ చైతన్యం కోసమే ఆమె శ్రమించారు. తనని దూషించేవారిని కూడా మార్చాలని తలపోశారు. ఆ ప్రయత్నం ప్రతిసారీ, కొత్త మలుపు వచ్చిన ప్రతిసారీ మొదటికే వచ్చేసరికి ఆమెకి చైతన్యం కన్నా మూర్ఖత్వం లోతు ఎక్కువ అని అర్ధం అయ్యింది. అందుకే పాపం వీళ్ళని మార్చడం నా వల్ల కాదని డిసైడ్ అయిపోయి ట్విట్టర్ కి గుడ్ బై చెప్పేసింది. ఇది నిజానికి ఆమె ఓటమి కాదు. విశాల దృక్పధం లేకుండా ఒక్క చోటే కూర్చుని తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్ళని నమ్మే వాళ్ల ఓటమి.