రేణుక చౌదరి కాంగ్రెస్ ని వీడే ఆలోచనలో ఉన్నారంటూ వార్తలొస్తున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తిరుగులేని ఇమేజ్ తెచ్చుకున్న రేణుక చాన్నాళ్ళ నుండి వెనకపడ్డారనే చెప్పాలి. నిజానికి ఖమ్మం కాంగ్రెస్ అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు రేణుక చౌదరి. గతంలో రెండు సార్లు ఖమ్మం ఎంపీగా పనిచేసిన రేణుక రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానం దగ్గర కూడా రేణుకకు మంచి పేరుంది. స్థానిక నేతలు, వర్గపోరు కారణంగా ఆమె కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ తరపున ఖమ్మం ఎంపీగా బరిలోకి దిగాలనుకుంటున్నారు.
అయితే కొందరు నేతలు ఆమెకి టికెట్ దక్కకుండా చేయాలని పావులు కదుపుతున్నారట. రేవంత్ రెడ్డి కానీ వేరే ఎవరైనా డబ్బు పెట్టగలిగే నాయకులకే టిక్కెటు ఇవ్వాలని తీర్మానాలు కూడా చేసుకున్నారట. దీంతో ఒకవేళ తనకి ఖమ్మం ఎంపీ టికెట్ దక్కకపోతే అవసరమైతే కాంగ్రెస్ ని వీడటానికి కూడా ఆమె రెడీ అయ్యారట. అసలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ కి.. ఇప్పుడు రేణుక వంటి సీనియర్ నేత గుడ్ బై చెప్తే పార్టీకి పెద్ద దెబ్బ అనే చెప్పాలి. మరి కాంగ్రెస్ అధిష్టానం రేణుకను ఎలా బుజ్జగిస్తుందో చూడాలి. రాష్ట్రము మొత్తం ఎదురు గాలి వీచినా ఖమ్మంలో కాస్త ఎక్కువ సీట్లు పట్టుకురావడానికి రేణుక కూడా ఒక కారణమే.