Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే అంటూ ప్రధాని మోడీ వీరభక్తుడు అర్ణబ్ గోస్వామి పెట్టిన రిపబ్లిక్ టీవీ తాజాగా చేసిన సర్వే ఫలితాల మీద ఇప్పుడు హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. దేశవ్యాప్తంగా బీజేపీ కూటమి 335 సీట్లు సాధిస్తే, కాంగ్రెస్ కేవలం 89 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని అర్ణబ్ సర్వే చెబుతోంది. అయితే ఈ సర్వే నిజంగా చేసిందా లేక బీజేపీ మనసులో మాట, కోరిక బయటకు చెప్పి ఓ పాజిటివ్ వాతావరణం క్రీయేట్ చేసేందుకు తలపెట్టిందా అన్న సందేహాలు వస్తున్నాయి. అందుకు కారణం చిన్నపిల్లవాడికి కూడా అర్ధమయ్యేలా ఆ సర్వే చెబుతున్న అబద్ధాలే.
పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 12 లోక్ సభ స్థానాలు గెలుస్తుందని చెప్పడం, మహారాష్ట్రలో కాంగ్రెస్ కేవలం 2 సీట్లు మాత్రమే దక్కించుకుంటుంది అని అంచనా వేయడం, కర్ణాటకలో కాంగ్రెస్ కి 5 స్థానాలు మాత్రమే వస్తాయనడం లాంటివి వాస్తవ విరుద్ధాలని ఆ రాష్ట్రాల్లో చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతాడు. దీంతో రిపబ్లిక్ టీవీ సర్వే మీద అనుమానాలు వచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాల గురించి రిపబ్లిక్ టీవీ చెప్పిన ఫలితాలు గురించి వింటే ఆ అనుమానాలు నిజమని, ఈ సర్వే బీజేపీ స్క్రిప్ట్ తో నడిచిందని చెప్పుకోవచ్చు. ఈ సర్వే ప్రకారం తెలంగాణాలో బీజేపీ కి మూడు స్థానాలు వస్తాయట. అందులో కనీసం ఒక్క నియోజకవర్గం పేరు చెప్పగలిగితే బాగుండేది. తెలంగాణ రాజకీయాల కనీస అవగాహన వున్న ఏ ఒక్కరిని అడిగినా బీజేపీ కి మూడు లోక్ సభ స్థానాలు రావడం పచ్చి అబద్ధం అని ఒప్పుకుంటారు.
ఇక ఆంధ్రప్రదేశ్ లో nda కూటమికి 12 అంటే టీడీపీ, బీజేపీ కి కలిపి పన్నెండు స్థానాలు వస్తాయని ఈ సర్వే చెప్పింది. ఇక ఇతరులకి అంటే వైసీపీ కి 13 స్థానాలు వస్తాయని తేల్చింది. తెలంగాణాలో బీజేపీ కి మూడు స్థానాలు వస్తాయని చెప్పడం అంటే అది పూర్తిగా కమలం అనుకూల సర్వే అని అర్ధం. అదే సర్వే ఆంధ్రకు వచ్చేసరికి వైసీపీ కి మొగ్గుజూపడం అంటే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్లాలన్న బీజేపీ ఆలోచనలకు ప్రాణం పోయడమే. ఇలాంటి విషయాల్లో మోడీ చెప్పినట్టే అర్ణబ్ ఆడతాడని వేరే చెప్పాలా ? అందుకే రిపబ్లిక్ టీవీ సర్వే చూసిన ఎవరికైనా బీజేపీ, వైసీపీ సీక్రెట్ లవ్ ఎఫైర్ తేలిగ్గా అర్ధం అవుతుంది.