పూరీ జగన్నాథునికి జలుబు చేసి జ్వరమొచ్చింది, ఆయనకే కాదు ఆయన వెన్నంటే ఉండే బలభద్రుడు, సుభద్రాదేవిలకు కూడా జలుబు చేసిందట అందుకే ప్రధానార్చకులు, దేవతామూర్తులను పదిహేను రోజుల పాటు చీకటి మందిరంలో ఉంచి, నైవేద్యాల్లో ఆయుర్వేద మూలికలను వినియోగిస్తున్నారు. అంతేకాదు, భక్తులకు స్వామివారి దర్శనం కూడా లభించడం లేదు. గర్భాలయంలో ‘పట్టా చిత్రా’ పేరిట స్వామివారి చిత్రపటాన్ని మాత్రమే ఉంచారు.
ఇదంతా ఏమిటీ అనుకుంటున్నారా ? పూరీలో దేవతామూర్తుల మూలవరుల విగ్రహాలు పూరీలోని మూలవరులను వేప చెక్కలతో రూపొందిస్తారు. స్వామికి నిత్యాభిషేకాలు చేస్తే కలప పాడవుతుందని ఇలా ప్రతి యేటా జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు మాత్రమే ఏడాదికోసారి అభిషేకం నిర్వహించే సంప్రదాయం వచ్చింది. స్వామివారికి నిత్యం దర్పణ స్నానం నిర్వహిస్తారు. అంటే.. స్వామివారి ఎదుట అద్దం ఉంచి.. అందులో కనిపించే ప్రతిబింబానికి అభిషేకం చేస్తారన్నమాట. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమినాడు మాత్రం మూలమూర్తికి ప్రత్యక్ష అభిషేకం చేసాక జగన్నాథుడితో పాటు బలభద్రుడు, సుభద్రలకు జ్వరం, జలుబు చేస్తుందన్న అనుమానంతో(నమ్మకంతో) మరలా వచ్చే పౌర్ణమి వరకూ వేరే గదిలోకి తరలిస్తారు. ఈ పదిహేను రోజులు స్వామికి సమర్పించే నైవేద్యాల్లోనూ ఆయుర్వేద మూలికలు వాడుతారు. ఈ పదిహేను రోజులు భక్తులకు జగన్నాథుడి దర్శనం లభించదు. గర్భాలయంలో స్వామివారి పటాన్ని ఉంచుతారు. దీనిని పట్టచిత్రా అని పిలుస్తారు. సరిగ్గా రథయాత్రకు ముందురోజు చీకటి మందిరం నుంచి మూలవరులను గర్భాలయానికి తీసుకువచ్చి ప్రతిష్ఠిస్తారు.