యువత అంతా ఉద్యోగ వేటలో ఉంది. రెజ్యుమె చేతిలో పట్టుకొని ఆఫీస్‌ల చుట్టూ తిరిగే వారు కొందరైతే, ఇంటర్నెట్ ద్వారా ఉద్యోగావకాశాలు వెతికే వారు మరికొందరు. కానీ ముంబైకి చెందిన అంకిత చావ్ల అనే యువతి వినూత్నంగా ప్రయత్నించింది. ఆమె సృజనాత్మకతను గుర్తించిన ఓ కంపెనీ పిలిచి మరీ ఉద్యోగమిచ్చింది.
డోంట్ వెయిట్ ఫర్ ద అపార్చునిటీ.. క్రియేట్ ద అపార్చునిటీ అన్నారు పెద్దలు. అవకాశాల కోసం వేచి చూడడం కన్నా ప్రతిభతో అవకాశాలను సృష్టించుకోవాలి. ముంబైకి చెందిన అంకిత అచ్చం అలాగే చేసింది. ఈమె విజువల్ కంటెంట్ క్రియేటర్. రైటింగ్ నైపుణ్యాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అంకిత ఫ్రెండ్స్ అందరూ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవారు. వారి ప్రయత్నాలు చూసి అంకితకు ఆశ్చర్యమేసేది. ఒకే ఫార్మాట్లో ఉండే రెజ్యుమెను పట్టుకొని ఆఫీస్‌ల చుట్టూ తిరగడం, ఇంటర్నెట్లో జాబ్ నోటిఫికేషన్లు వెతకడం ఆమెకు వింతగా అనిపించింది. ఎందుకు ఇలానే చేయాలి? అనుకుంది. తన ఇన్‌స్టా అకౌంట్లో రెజ్యుమె పెట్టింది. దాన్ని రొటీన్ ఫార్మాట్లో కాకుండా క్రియేటివ్‌గా తయారు చేసింది. హైర్ అంకిత చావ్ల పేరుతో ఇన్‌స్టా ప్రొఫైల్‌ను మార్చేసింది. తన నైపుణ్యాలను జోడించింది. దీన్ని ప్రముఖ కంపెనీ డెలాయిట్ ఇండియా చూసింది. వెంటనే అంకితకు ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది. ఇప్పుడు అంకిత అక్కడ విజువల్ కంటెంట్ క్రియేటర్‌గా పనిలో ఉంది. ఇలా అంకిత అందరికన్నా భిన్నమైన ఆలోచనలతో ఉద్యోగాన్ని సంపాదించింది.