ప్రపంచకప్‌ల హీరో, టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ జెర్సీ నంబర్ 12ని మరెవరికీ కేటాయించకుండా దానికి రిటైర్మెంటివ్వాలని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ)కి విజ్ఞప్తి చేసినట్టు సమాచారం తెలుస్తోంది. గౌతమ్ గంభీర్ గత డిసెంబరులో క్రికెట్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయాల్లోకి వచ్చారు. మరోవైపు యువరాజ్ సింగ్ ఈ జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. యువీ ప్రస్తుతం విదేశీ లీగ్‌లపై దృష్టి సారించారు. ఇటీవల ముగిసిన కెనడా టీ20 లీగ్‌లో యువీ తన మునుపటి ఫామ్ చూపిస్తూ సిక్సర్ల వర్షం కురిపించారు.
గంభీర్ ఓ మీడియాకు రాసిన కథనంలో పలు విషయాలను ప్రస్తావించారు. యువీ టీంఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు అతను జెర్సీ నెం.12ను ధరించేవాడు. టీమిండియాకు రెండుసార్లు (2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్) ప్రపంచకప్ అందించిన యవీకి ఇదే (జెర్సీ రిటైర్మెంట్) అత్యుత్తమ గౌరవమని బీజేపీ ఎంపీ గంభీర్ పేర్కొన్నాడు. సెప్టెంబర్ నెల తన హృదయంలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. ఎందుకంటే.. 2007లో టీమిండియా ఇదే నెలలో తొలిసారి టీ20 ప్రపంచకప్ గెలిచింది’ అని గంభీర్ గుర్తు చేసుకున్నాడు.
యువీతో పాటు రెండు ప్రపంచకప్‌లలో గంభీర్ కూడా జట్టు సభ్యుడే. అంతేకాదు రెండు ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లలో టాప్ స్కోరర్. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో గంభీర్ సెంచరీ (97) ముందు ఔట్ అయ్యారు. ఇక టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో 54 బంతుల్లో 75 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించారు.