గులాబీ కూలి… ఈ కార్యక్రమం గుర్తుండే ఉంటుంది. 2017 ఏప్రిల్ 27న తెరాస వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం ఇది. ఆ సందర్భంగా వరంగల్ లో భారీ బహిరంగ సభను తెరాస ఏర్పాటు చేసింది. పెద్ద ఎత్తున తరలి వచ్చే కార్యకర్తల ఖర్చుల కోసం నిధులను పార్టీ నాయకులే కూలి చేసి సంపాదించాలని డిసైడ్ అయ్యారు. దీని కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కూలి పని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొన్ని నిమిషాలు పనులు చేసి… లక్షలకు లక్షలు సంపాదించారు! చెక్కుల రూపంలో పార్టీ ఫండ్ గా దీన్ని స్వీకరించారు. కూలి పని చేస్తే లక్షలు ఎట్లా వచ్చాయంటూ రేవంత్ రెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఇది అధికార దుర్వినియోగమనీ, ప్రజాప్రాతినిధ్య చట్టాన్నీ, అవినీతి నిర్మూలన చట్టాన్ని ఉల్లఘించడమే అవుతుందంటూ రాజ్యాంగ సంస్థలన్నింటికీ రేవంత్ రెడ్డి ఫిర్యాదులు చేశారు.
అప్పటి అంశాన్ని ఇప్పుడెందుకు గుర్తుచేసుకోవడమంటే… ఓ వారం రోజులు కిందటే అప్పటి ఫిర్యాదుపై కేంద్రం స్పందించిందని తెలుస్తోంది! ఇన్నాళ్లూ రేవంత్ ఫిర్యాదుల్ని పట్టించుకోని ఆదాయపన్ను శాఖ ఇప్పుడు స్పందించడం విశేషం. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ మరోరకంగా లాభం చేకూరేలా ఈ కూలి పనుల వివరాలున్నాయనంటూ ఆదాయపన్ను శాఖ తెరాస నేతల పనితీరుని ఇప్పుడు తప్పుబడుతోంది. ఈ క్రమంలో తెరాస కీలక నేతలకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. వీటిని అందుకున్నవాళ్లలో మంత్రులు హరీష్ రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఈటెల రాజేందర్, మహమూద్ అలీ ఉన్నట్టు తెలుస్తోంది. ఓవారం కిందటే వీరికి నోటీసులు అందినా… ఈ సమాచారాన్ని బయటకి పొక్కనీయకుండా వీరంతా జాగ్రత్తపడ్డారని సమాచారం.
తనకు అందిన నోటీసుని ఒక మంత్రి పార్టీ కార్యాలయానికి తీసుకుని రావడంతో ఎవరెవరికి నోటీసులు అందాయనేది బయటపడింది. దీనిపై పార్టీలో చర్చ జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే, అప్పుడెప్పుడో గులాబీ కూలి కార్యక్రమం జరిగితే అప్పుడెందుకు కేంద్రం స్పందించలేదు, ఇప్పుడెందుకు స్పందించిందీ అనేది అర్థమౌతూనే ఉంది. అప్పట్లో కేంద్రంలోని మోడీ సర్కారుతో తెరాసకు మంచి స్నేహం ఉండేది. మోడీ సర్కారు నిర్ణయాలకు మద్దతుగా కేసీఆర్ వ్యవహరించేవారు. కానీ, ఈ మధ్య కేంద్రం తీరుపై మండిపడుతున్నారు. మరీ ముఖ్యంగా కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సీఏఏని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బడ్జెట్లో అన్యాయం జరిగింది అంటూ పార్లమెంటులో తెరాస ఎంపీలు విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ వ్యవహారంపై కేంద్రం గుర్రుగా ఉందనీ, అందుకే తెరాస నేతలకు నోటీసులు అందాయనీ భావించొచ్చు. ఈ నోటీసులపై ఎలా స్పందించాలనేది తెరాస అధినాయకత్వం ఇంకా ఖరారు చేయలేదని తెలుస్తోంది.