రేవంత్ తెలంగాణా కాంగ్రెస్ సీఎం క్యాండిడేట్ అని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం మీద రేవంత్ స్పందించారు. రేవంత్ దూకుడుగా మాట్లాడతాడు అని టీఆర్ఎస్ తన దూకుడుపై అందరిలోనూ తప్పుడు అభిప్రాయం కలిగేలా టీఆర్ఎస్ రహస్య ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ఏ పదవిని అప్పగించినా సమర్థవంతంగా నిర్వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నాకు అనుభవం లేదని కొందరు అంటున్నారని ఎన్టీఆర్ షష్టిపూర్తి తర్వాత రాజకీయాల్లోకి రాలేదా, ఎలాంటి రాజకీయ అనుభవం లేని స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రభుత్వం నడపలేదా అని ప్రశ్నించారు. అలాగే రాజీవ్ గాంధీ విపత్కర పరిస్థితుల్లో ప్రధాని కాలేదా. వాళ్లిద్దరికి అనుభవం లేకున్నా.. పటిష్ట నాయకత్వం అందించిన చరిత్ర ఉంది. ప్రజల కోసం పోరాడుతున్నందుకే కాంగ్రెస్ పదవులు ఇచ్చింది.. ఉపన్యాసాలు, పోరాటాలే కాదు పరిపాలన ఎలా చేయాలో తెలుసు. ప్రజా సంక్షేమం కోసం పోరాడుతూనే ఉంటానన్నారు’రేవంత్. ‘తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కూటమి. మా పాలనలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తాం.. వ్యవసాయాన్ని లాభదాయకం చేస్తాం.. ప్రతి ఏడాది ఉద్యోగాలను భర్తీ చేస్తాం.. విద్య వైద్యం మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.. నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తాం.. పాలనలో ప్రజల భాగస్వామ్యం మా ప్రాధాన్యం. రైతుల విషయానికొస్తే.. రుణమాఫీ తాత్కాలిక ఉపశమనం.. గిట్టుబాటు ధర అనేది లాభదాయకం. రైతు పండించిన పంటలను కోనుగోలు చేసేందుకు ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసి.. దాని ద్వారానే కొనుగోలు చేసే ఆలోచన చేస్తున్నామన్నారు’.
తెరాస అజెండానే ప్రజల అజెండాగా కేసీఆర్ భ్రమలు కల్పించారని, అన్ని వర్గాలను మభ్యపెట్టి తన వైపునకు తిప్పుకున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.నీళ్లు, నిధులు, నియామకాలు ప్రజల నినాదం అని, టీఆర్‌ఎస్‌ది కాదన్నారు. రాజకీయ మనుగడ కోసం ఈ నినాదాన్ని విస్తరింపజేసి ప్రజల భావోద్వేగాలను పార్టీకోసం కేసీఆర్ వాడుకున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. అలాగే స్వయం పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, టీఆర్‌ఎస్ పాలనలో సామాజిక న్యాయం జరగలేదని, పటేల్, పట్వారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడారని, కేసీఆర్ మార్క్ పాలనను ప్రజలపై రుద్దారని ఆయన అన్నారు. కేసీఆర్ డిక్షనరీలో సామాజిక న్యాయం అనే పదమేలేదని, మహిళలకు కనీస మర్యాద, గౌరవం ఇవ్వకపోవడం దారుణం అన్నారు. నక్సలైట్ల అజెండానే మా అజెండా అని కేసీఆర్ అన్నారని, కొడుకు మంత్రి, కూతురు ఎంపీ కావాలని ఏ నక్సలైట్ అజెండాలో ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు. అలాగే అనూహ్యంగా ఈ మీట్ ద ప్రెస్‌లో రేవంత్ ఒక డాక్యుమెంట్ విడుదల చేసి తన పాలనా ఐడియాలను పంచుకున్నారు. జర్నలిస్టులు, పోలీసులు, ఆర్టీసీ సిబ్బందికి సమయాలతో సంబంధం లేకుండా విధులుంటాయి. వీరి పని ప్రజాసేవ. అలాంటి వారికి ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం. వారి పిల్లలకు ఉచిత విద్య, వైద్యం అందాలన్నది నా కోరిక అని రేవంత్ చెప్పారు. వారికి ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటుచేసి అందులో మెడికల్, ఇంజినీరింగ్ విద్యను కూడా అందిస్తానన్నారు.