రేవంత్ టీడీపీని వీడినట్టే…

Revanth reddy reacts on Party Changing

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలంగాణ రాజ‌కీయాలు రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్ప‌టిదాకా తెలంగాణ‌లో టీడీపీకి కీల‌క‌నేత‌గా ఉన్న రేవంత్ రెడ్డి పార్టీ మార‌తార‌న్న వార్త‌లు తీవ్ర సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ నుంచి హైద‌రాబాద్ వ‌చ్చిన రేవంత్ త‌న‌పై వ‌స్తున్న వార్త‌ల‌మీద స్పందించారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో ఏపీ టీడీపీ నేత‌లు వ్య‌వ‌హ‌రించిన తీరుపై అసంతృప్తిగా ఉన్న రేవంత్ త్వ‌రలోనే కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నార‌ని, ఇందుకోస‌మే ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో చ‌ర్చ‌లు జ‌రిపార‌ని వ‌స్తున్న వార్త‌ల‌పై రియాక్ట‌య్యారు. కొన్నిరోజులుగా కాంగ్రెస్ తో క‌లిసి ప‌నిచేస్తున్నామ‌ని, పొత్తులు పెట్టుకునే అవ‌కాశం ఉన్న‌ప్పుడు కాంగ్రెస్ అధిష్టానాన్ని క‌లిస్తే త‌ప్పేంట‌ని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. టీఆర్ఎస్ నేత‌ల‌పై వేయ‌నున్న కేసుల గురించి న్యాయ‌వాదుల‌తో మాట్లాడేందుకే ఢిల్లీ వెళ్లాన‌ని ఇప్ప‌టిదాకా చెప్పిన రేవంత్… ఉన్న‌ట్టుండి ఇలా వ్యాఖ్యానించ‌డం చూస్తుంటే… కాంగ్రెస్ లో చేరిక‌పై ఆయ‌న ఓ స్ప‌ష్ట‌మైన నిర్ణ‌యం తీసుకున్న‌ట్టే క‌నిపిస్తోంది.

కాంగ్రెస్ అధిష్టానాన్ని క‌లిస్తే త‌ప్పేంట‌ని ప్ర‌శ్నించ‌డం ద్వారా… ఆయ‌న ప‌రోక్షంగా ఈ విష‌యాన్ని నిర్ధారించిన‌ట్టు కూడా అయింది. హైద‌రాబాద్ జూబ్లిహిల్స్ లోని త‌న నివాసంలో మీడియా తో నిర్వ‌హించిన ఇష్టాగోష్టిలో తాను ఢిల్లీ పెద్ద‌ల‌ను క‌ల‌వ‌డంతో పాటు… టీడీపిపై త‌న‌కున్న అసంతృప్తికి గ‌ల కార‌ణాల‌నూ రేవంత్ వివ‌రించారు. సిద్ధాంతాలు చెప్పుకునే పార్టీలు పొరుగురాష్ట్రాల్లోని పార్టీల‌తో వేర్వేరుగా పొత్తులు పెట్టుకోవ‌డ‌మేమిట‌ని ప్ర‌శ్నించ‌టం ద్వారా అధికారికంగా పార్టీని వీడ‌క‌ముందే ఆయ‌న టీడీపీపై విమ‌ర్శ‌లు మొదలుపెట్టారు. పొరుగురాష్ట్రాల పొత్తులంటూ ఆయ‌న ప‌రోక్షంగా ప్ర‌స్తావించింది… తెలంగాణ‌లో టీడీపీ, టీఆర్ ఎస్ పొత్తుపై వ‌స్తున్న ఊహాగానాల గురించే.

ఇక 2014లో టీఆర్ ఎస్ అధికారంలోకి వ‌చ్చిన ద‌గ్గ‌ర‌నుంచి తెలంగాణ‌లో ఆ పార్టీపైనా, ముఖ్య‌మంత్రి కేసీఆర్ పైనా అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్న రేవంత్ రెడ్డి… ఏపీలో ఇటీవ‌ల జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌పై మ‌న‌స్తాపం చెందారు. ఆ విష‌యాన్నే మీడియాకు వివ‌రించారు. తాను తెలంగాణ‌లో కేసీఆర్ కు వ్య‌తిరేకంగా పోరాడుతోంటే… ఏపీ మంత్రులు మాత్రం కేసీఆర్ విష‌యంలో అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. రెండేళ్ల క్రితం… న‌వ్యాంధ్ర రాజ‌ధాని శంకుస్థాప‌న‌కు కేసీఆర్ వెళ్లిన‌ప్పుడు, ఇటీవ‌ల ప‌రిటాల శ్రీరామ్ పెళ్లికి హాజ‌ర‌యిన‌ప్పుడు ఏపీ మంత్రులు, నేత‌లు, కేసీఆర్ కు అమిత గౌర‌వం ఇచ్చార‌ని మండిప‌డ్డారు. త‌న‌ను జైల్లో పెట్టించిన కేసీఆర్ కు ఏపీ టీడీపీనేత‌లు వంగి వంగి దండాలు పెడ‌తారా… అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

చంద్ర‌బాబునాయుడు తెలంగాణ‌కు వ‌స్తే టీఆర్ ఎస్ నేత‌లు ఒక్క‌రు కూడా ఆయ‌న వ‌ద్ద క‌నిపించ‌ర‌ని, మ‌రి ఏపీ నేత‌ల‌కు ఎందుకింత అత్యుత్సాహం అని ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. అస‌లు ఏపీ మంత్రుల‌కు చెందిన కంపెనీల‌కు తెలంగాణ‌లో అనుమ‌తులు ఎలా వ‌చ్చాయని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఏపీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడికి కేసీఆర్ రూ. 2వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చార‌ని, అందుకే కేసీఆర్ పై య‌న‌మ‌ల ఈగ కూడా వాల‌నివ్వ‌ర‌ని రేవంత్ ఆరోపించారు. తెలంగాణ‌లో ప‌రిటాల సునీత కొడుకు, ప‌య్యావుల కేశ‌వ్ అల్లుడు న‌డుపుతున్న బార్ కు లైసెన్స్ ఎలా వ‌చ్చింద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఏపీకి చెందిన ముఖ్య‌నేత‌ల‌కు తెలంగాణ‌లో కాంట్రాక్టులు ద‌క్కుతున్నాయ‌ని, అలాంట‌ప్పుడు తెలంగాణ టీడీపీ నేత‌ల‌కు టీఆర్ ఎస్ వైఖ‌రిని ప్ర‌శ్నించ‌గ‌లిగే అవ‌కాశం ఉండ‌ద‌ని ఆయ‌న ఆక్షేపించారు.

ఢిల్లీలో తాను చంద్ర‌బాబు అపాయింట్ మెంట్ కోరాన‌న‌డం అవాస్త‌వ‌మ‌ని, ఆయ‌న విదేశాల నుంచి వ‌చ్చిన త‌రువాతే… ఆయ‌న‌తో స‌మావేశ‌మై ఓ నిర్ణ‌యం తీసుకుంటాన‌ని రేవంత్ చెప్పారు. తెలంగాణ‌లో పార్టీలు లేవ‌ని, కేసీఆర్, కేసీఆర్ వ్య‌తిరేకులు మాత్ర‌మే ప‌నిచేస్తున్నార‌ని రేవంత్ అన్నారు. కేసీఆర్ ను మ‌ళ్లీ సీఎం చేయ‌డానికి తాము సిద్దంగా లేమ‌ని స్ప‌ష్టంచేశారు. తెలంగాణ‌లో పున‌రేకీక‌ర‌ణ జ‌రుగుతోంద‌ని, అందులో తాను కీల‌క‌పాత్ర పోషిస్తాన‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. డిసెంబ‌రు 9 నుంచి రాష్ట్రంలో పాద‌యాత్ర చేస్తాన‌ని తెలిపారు. స్థానిక ప‌రిస్థితుల‌ను బ‌ట్టి త‌మ‌కు ఇష్టం వ‌చ్చిన పార్టీతో పొత్తు పెట్టుకునే అధికారాన్ని చంద్ర‌బాబు త‌మ‌కు ఇవ్వాల‌ని రేవంత్ రెడ్డి కోరారు. అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోడానికి సిద్దంగా ఉన్నామ‌ని తెలిపారు.

రాష్ట్రంలో బీజేపీలేద‌ని, అందుకే ద‌త్తాత్రేయ‌ను కేంద్ర మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గించార‌ని విమ‌ర్శించారు. అటు రేవంతుడి కాంగ్రెస్ చేరిక‌పై ఇంకా క్లారిటీ లేక‌పోయిన‌ప్ప‌టికీ ఆ పార్టీ నేత‌లు మాత్రం రేవంత్ ను త‌మ పార్టీలోకి స్వాగ‌తిస్తున్నారు. రేవంత్ రెడ్డి గురించి ప్ర‌త్య‌క్షంగా చెప్ప‌క‌పోయిన‌ప్ప‌టికీ… తెలంగాణ‌లో టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ నుంచి మ‌రికొంత‌మంది నేత‌లు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నార‌ని ఆ రాష్ట్ర కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇన్ ఛార్జ్ కుంతియా చెప్పారు. అటు ఇంకా పార్టీని వీడ‌క‌ముందే టీడీపీ సైతం రేవంత్ పై విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. రేవంత్ పార్టీ మారినా పెద్ద‌గా న‌ష్టం ఏమీ లేద‌ని టీడీపీ జాతీయ అధికార ప్ర‌తినిధి అర‌వింద్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. రేవంత్ చేసిన త‌ప్పిదాల వ‌ల్లే తెలంగాణ‌లో టీడీపీ బ‌ల‌హీన ప‌డింద‌ని ఆరోపించారు. మొత్తానికి తాజా ప‌రిణామాలు చూస్తోంటే…రేవంత్ రెడ్డి రేపో మాపో కాంగ్రెస్ లో చేర‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.