కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఉదయం ఆయన ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా ఆ సమయంలో రేవంత్ ఇంట్లో లేరు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు. అన్నీ మంచిగా ఉంటే మళ్లీ వస్తానని, లేకపోతే జైలు నుంచే నామినేషన్ వేస్తానని రేవంత్ రెడ్డి అన్నారు. తనను అరెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రజలు అండగా ఉన్నారనే ధైర్యంతోనే హైదరాబాదుకు వెళ్తున్నానని చెప్పారు. ఇదే తన ఆఖరి ప్రసంగం కావచ్చని తెలిపారు. తాను జైల్లో ఉన్నా కొడంగల్ నుంచే పోటీ చేస్తానని 50 వేల ఓట్ల మెజార్టీతో తనను గెలిపించే బాధ్యత మీదేనని చెప్పారు.
కొడంగల్ నియోజకవర్గంలోని కొస్గిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతూ ఆయన ఈమేరకు వ్యాఖ్యానించారు. జైల్లో తిన్న చిప్పకూడు మీద ఒట్టేసి చెబుతున్నా… కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దించేంత వరకు నిద్రపోనంటూ రేవంత్ ప్రతిజ్ఞ చేశారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేకే, ఏమీ చేయలేకే… ఐటీ దాడులు చేయిస్తున్నారంటూ మండిపడ్డారు. మోదీ, కేసీఆర్ లు కలసి అక్రమ కేసులను బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా… తన విజయాన్ని అడ్డుకోలేరని చెప్పారు.