Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు అయ్యింది. రేపే ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ జెండా కిందకి చేరబోతున్నారు. కాంగ్రెస్ లో ఏళ్ళ తరబడి ఉంటున్న నేతలకే 10 జన్ పథ్ అనుగ్రహం దొరకడం కష్టం. సోనియా, రాహుల్ అపాయింట్ మెంట్ కోసం కాంగ్రెస్ లో కాకలు దీరిన నేతలే పడికాపులు పడుతుంటారు. అలాంటిది కాంగ్రెస్ లో చేరకముందే రాహుల్ తో కలవడం, చేరడానికి రాహుల్ దగ్గరికి వెళ్లడం రేవంత్ కి తేలిగ్గా జరిగిపోయాయి. రాహుల్ దగ్గర రేవంత్ కి ఇంత ప్రాధాన్యం లభించడానికి ఆయన కి మామ వరసయ్యే జైపాల్ రెడ్డి కారణం అని చాలా మంది అనుకుంటున్నారు. అయితే అసలు కారణం, దాని వెనుక వున్న వ్యక్తి వేరే.
తెలంగాణ రాజకీయాల్లో కెసిఆర్ ని ఢీకొట్టే శక్తిగా రేవంత్ కనిపించడానికి కారణం ఆయన దూకుడు. ఈ దూకుడే ఇంతకుముందు టీడీపీ లో కూడా రేవంత్ కి ప్రాధాన్యం దక్కేలా చేసింది. అదే లక్షణం రాహుల్ కి సలహాదారు పాత్ర పోషిస్తున్న తెలుగు వ్యక్తి కొప్పుల రాజుని విశేషంగా ఆకట్టుకుంది. ఆయనే దాదాపు ఆరేడు నెలలుగా తెలంగాణాలో కాంగ్రెస్ ని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు ఎంతో మంది నేతలతో కలిశారు. వీరిలో ఎక్కువమంది అంతర్గత కలహాలతో మునిగిపోయి కనిపించారు . లేదా పార్టీ మీద ఆధారపడ్డవాళ్లే అనిపించారు. టీడీపీ కి వున్న ప్రతికూల పరిస్థితుల్ని కూడా తట్టుకుని తెలంగాణాలో రేవంత్ చేస్తున్న పోరాటాన్ని నిశితంగా గమనించిన రాజు చివరకు ఆయన్ని కాంగ్రెస్ లోకి తెచ్చేందుకు ఎంతో కాలంగా ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. రాహుల్ దగ్గర రేవంత్ పోరాట శైలిని గొప్పగా చెప్పారు కూడా. తెలంగాణ ఇచ్చినా అక్కడ అధికారం రాకపోవడానికి స్థానిక నాయకులే కారణం అని భావిస్తున్న రాహుల్ కూడా రాజు గారి మాటలకి ఓకే చెప్పి రేవంత్ కి పెద్ద పీట వేయడానికి రెడీ అయిపోయారు. మొత్తానికి తన దూకుడు, కొప్పుల రాజు ఆదరణ కలిసి రేవంత్ ని రాహుల్ దగ్గర గట్టి నేతగా నిలబెట్టాయి.