Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంది అవార్డులపై వివాదం కొనసాగుతోంది. అద్భుతమైన నిజాయితీ గల నంది అవార్డుల కమిటీకి కచ్చితంగా ఆస్కార్ అవార్డు ఇవ్వాలని, తనకు అవార్డ్ కమిటీ సభ్యుల పాదాలను తాకాలని ఉందని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ నంది అవార్డుల కమిటీ సభ్యుడు మద్దినేని రమేశ్ బాబు తీవ్ర అసభ్య పదజాలంతో వర్మను దూషించారు. దీనిపై వర్మ తాజగా తన ఫేస్ బుక్ లో స్పందించారు. .. ప్రజాస్వామ్య దేశంలో జరుగుతున్న ఒక విషయం మీద అభిప్రాయం వ్యక్తపరిచే హక్కు ఎవరికైనా ఉంటుందని, అలాగే తానూ నంది అవార్డులు ప్రకటించిన వైనంపై స్పందించానని తెలిపారు. దానికి సమాధానంగా గౌరవనీయమైన అవార్డ్ కమిటీ మెంబరు మద్దినేని రమేశ్ బాబు కింది విధంగా స్పందించారని తెలియజేస్తూ…
రమేశ్ బాబు తనపై చేసిన వ్యాఖ్యలను యథాతథంగా తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్టు తర్వాత మరోసారి వర్మ తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. తనను తిట్టినందుకు తనకేమీ బాధలేదని, అయితే ఇలాంటి వ్యక్తులను అవార్డు కమిటీలో ఎన్నుకున్నందుకు ప్రభుత్వం మీద బాధగా ఉందని వర్మ వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యక్తులను మెంబర్లుగా ఎన్నుకున్న ప్రభుత్వం పట్ల ఆశ్చర్యపడాలో, బాధపడాలో తనకు తెలియడం లేదని, అన్నం గురించి తెలియటానికి ఒక్క మెతుకు చాలంటారని, మద్దినేని రమేష్ బాబు ఆ మెతుకైతే..అన్నం కమిటీ అనుకునే పరిస్థితి వచ్చినందుకు ప్రభుత్వమే వివరణ ఇవ్వాలని వర్మ విచారం వ్యక్తంచేశారు.