దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం, హత్య ఘటనపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న చిత్రానికి వరుసగా అడ్డంకులు వచ్చిపడుతున్నాయి. దిశ హత్యతోపాటు ఆమెపై దాడికి పాల్పడిన వారిని ఎన్కౌంటర్ చేసిన ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో సినిమా నిర్మాణం చేపట్టడం సరికాదని దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి ఇదివరకే హైకోర్టును ఆశ్రయించారు.
సినిమాను నిలిపివేసేలా కేంద్రప్రభుత్వం, సెన్సార్ బోర్డును ఆదేశించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ దశలో ఉన్న క్రమంలోనే మరో పిటిషన్ దాఖలైంది. ఈ చిత్రాన్ని నిలిపి వెయ్యాలని కోరుతూ దిశ నిందితుల కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టు జ్యుడీషియల్ కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులచే ఎన్‌కౌంటర్‌కు గురైన జోళ్లు శివ, జోళ్ళు నవీన్, చెన్నకేశవులు, హైమ్మద్ ఆరీఫ్ కుటుంబ సభ్యులు సోమవారం హైకోర్టుకు చేరుకున్నారు.
ఈ చిత్రంలో తమ వాళ్ళను విలన్స్‌గా చూపెడుతూ.. చెడుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారన్ని కమిటీకి ఫిర్యాదు చేశారు. దీని వల్లకు నిందితుల కుటుంబ సభ్యుల హక్కులకు భంగం కలుగుతోందని వాపోయారు. కుటుంబ సభ్యులతో పాటు పెరుగుతున్న పిల్లల మీద ఈ చిత్రం తీవ్ర ప్రభావం పడుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. చనిపోయినపై చిత్రాన్ని తీసి తమను మానసికంగా చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.