పవన్ ని ఆర్కే తిట్టాడా ,పొగిడాడా ?
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అయోమయ రాజకీయం నడుస్తోంది. టీడీపీ , బీజేపీ పేరుకి మిత్రపక్షాలు కానీ ఒకరి మీద ఒకరికి ఏ మాత్రం నమ్మకం లేదు. అనుక్షణం అనుమానాల మధ్య సాగుతున్న ఈ బలవంతపు కాపురం ఎప్పుడు ముక్కలు చెక్కలు అవుతుందో అన్నట్టు వుంది. ఇక వైసీపీ , బీజేపీ లు నిజానికి శత్రు పక్షాలు. కానీ ఇద్దరూ ఒకరినొకరు ఒక్క మాట అనుకోవడంలేదు. ఈ అండర్ స్టాండింగ్ ఎప్పుడైనా ఎన్నికల పొత్తుకు దారి తీయొచ్చు. అసలే గందరగోళంగా ఉన్న ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజులుగా సాగిస్తున్న పర్యటనలు, వివిధ అంశాలపై ఆయన వ్యక్తం చేస్తున్న అభిప్రాయాల్లో స్పష్టత లేదు. బీజేపీ , టీడీపీ , వైసీపీ ల మీద ఏక కాలంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన అందులో ఏ మాటకు కట్టుబడి రాజకీయాలు చేస్తారు అన్న దానిపై స్పష్టత లేదు.
పార్టీల విషయం ఎలా వున్నా తనపై కాపు ముద్ర వేయడానికి ఆంధ్రజ్యోతి పత్రిక ప్రయత్నించిందని పవన్ కళ్యాణ్ అన్న మాటల కి సమాధానం అన్నట్టు రాధాకృష్ణ ఎడిటోరియల్ రాసారు. ఫక్తు రాజకీయ నాయకులతో పోల్చుకుంటే పవన్ లో నిజాయితీ, నిబద్ధత కనిపిస్తోందని అయితే కేవలం ఆవేశం వల్ల ఒరిగేది ఏమీ లేదని ఆర్కే వివరించారు. అందరు రాజకీయ నాయకుల్లా కులాన్ని స్వప్రయోజనానికి వాడుకోకుండా పవన్ మంచి పనే చేస్తున్నారని పొగిడారు. అదే సమయంలో పవన్ ఏ పత్రికలో ఏ సామాజిక వర్గం వారు ఎందరు వున్నారో లెక్క తేలుస్తానని అన్న కామెంట్స్ మీద ఆర్కే భిన్నంగా రియాక్ట్ అయ్యారు. పవన్ కన్నా చాలా పెద్ద వాళ్ళు తనను దెబ్బ కొట్టడానికి ప్రయత్నించినా లెక్క చేయని వైనాన్ని రాధాకృష్ణ గుర్తు చేశారు. ఓ వైపు పొగడ్తలు , ఇంకో వైపు తెగడ్తలతో ఆర్కే ఇంకాస్త అయోమయం పెంచారు. ఇంతకీ ఆయన పవన్ ని పొగిడారో , తిట్టారో అర్ధం కావడం లేదు.