సుమారు 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబడిన చిత్రం ‘రోబో 2.0’. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తుండగా, లైకా ప్రొడక్షన్ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమా బడ్జెట్ లో అత్యధిక భాగం విజువల్ ఎఫెక్ట్స్ లకే ఖర్చు చేయగా, సినిమా చూసే ప్రేక్షకుడికి ఇప్పటివరకు చూడని అద్భుతమైన గ్రాఫిక్స్ మాయాజాలాన్ని చూపబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా రేపు (గురువారం) విడుదలవ్వబోతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే వంద కోట్ల రూపాయలను వెనక్కు తెచ్చాయని తెలుస్తుంది. ఈ సినిమాలో వాడిన సాంకేతిక పరిజ్ఞానం హాలీవుడ్ స్థాయిలో ఉంటుందని చిత్ర దర్శకుడు తెలిపారు.
ఈ రోబో 2.0 సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ పర్యవేక్షకుడుగా వ్యవహరించిన శ్రీనివాస మోహన్ ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన విషయాన్నీ తెలిపాడు. ఈ సినిమాలో రోబో పాత్రలకి కళ్ళజోడు ఎందుకు ఉంచారు అని అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ఆశ్చర్యం కలిగించేలా ఉంది. ఈ విషయం పైన శ్రీనివాస మోహన్ ఏమన్నారంటే “రోబో పాత్రలకి కళ్ళజోడు పెట్టకుండా ఉంటే వాటి కనుల మరియు కనుబొమ్మల కదలికలను యానిమేషన్ ద్వారా సృష్టించాలి. కానీ, అది చాలా ఖర్చుతో కూడుకున్న కష్టతరమైన పని. ఒకవేళ కళ్ళజోడు లేకుండా కనులు మరియు కనుబొమ్మలు కూడా చూపించాలంటే ఇప్పుడు ఖర్చుచేసినా బడ్జెట్ ఇంకొన్ని కోట్లకు పెరిగేది. కాస్ట్ కటింగ్ లో భాగంగా ఇలా రోబోలకు కళ్ళజోడు పెట్టాలన్న ఆలోచన చేశాము” అని చెప్పారు.