తెలుగు రాష్ట్రాలు భానుడి ప్రకోపానికి అల్లాడుతున్నాయి. రోళ్లు పగిలే రోహిణీ కార్తె శనివారం నుంచి ప్రారంభం కాగా, అందుకు తగ్గట్టుగానే ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయితో పోలిస్తే మూడు నుంచి ఆరు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. సాయంత్రం 5 గంటల తరువాత కూడా వడగాడ్పులు వీశాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అగ్నికీలల్లా సూర్యకిరణాలు తాకుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడి భగభగలు ప్రజలను తీవ్ర ఉక్కపోతకు గురిచేస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అర్ధరాత్రి దాటినా తగ్గని వేడిగాలులతో నిద్రలేక విలవిల్లాడుతున్నారు. కరెంట్ కు ఎన్నడూ లేనంత డిమాండ్ పెరిగింది. వాయవ్య దిశ నుంచి వీస్తున్న వడగాలుల కారణంగానే ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తేమ శాతంలో మార్పుల కారణంగానే నిప్పులగుండంగా రాష్ట్రం మారింది. మరో మూడు రోజుల పాటు రోహిణి మంటలు కొనసాగుతాయని, ఆపై మరో వారం వరకూ సాధారణం కన్నా ఒకటి నుంచి రెండు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, రుతుపవనాలు ప్రవేశించిన తరువాతే సాధారణ స్థాయి నెలకొంటుందని అంచనా వేసింది వాతావరణ కేంద్రం.