Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ‘టచ్ చేసి చూడు’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. కొత్త దర్శకుడు విక్రమ్ సిరికొండ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఒక పవర్ కాప్ స్టోరీని ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అందించాడని, వంశీ గతంలో కథలు అందించిన చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి, కనుక ఖచ్చితంగా ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు పబ్లిసిటీ చేస్తూ వచ్చారు. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించాడు అనే ప్రచారంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. టాలీవుడ్‌లో ప్రస్తుతం టాప్ స్టోరీ రైటర్‌గా ఉన్న వంశీ నుండి ప్రేక్షకులు చాలా ఆశించారు.
‘టచ్ చేసి చూడు’ చిత్రం కథ చాలా రొటీన్‌గా, పది చిత్రాల కథలను మిక్కీలో వేసి ఒక కథను తీసినట్లుగా ఉంది. గతంలో వచ్చిన పలు కాప్ స్టోరీలకు అచ్చు గుద్దినట్లుగా ఉంది. కథ మరియు రవితేజ పాత్ర చాలా మూసగా ఉందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కథ విషయంలో వక్కంతం వంశీ తీవ్రంగా నిరాశ పర్చాడు అంటూ రివ్యూవర్స్ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక సాధారణ ప్రేక్షకులు ఈ సినిమా పరమ రొటీన్ కథ అంటూ తీసి పారేస్తున్నారు. గతంలో రవితేజకు సూపర్ హిట్ ఇచ్చిన రచయిత వంశీ అదే రవితేజకు అట్టర్ ఫ్లాప్‌ను కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఈ రచయిత ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ‘నా పేరు సూర్య’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి అయ్యాయి. ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేయబోతున్నారు. ‘నా పేరు సూర్య’ కథ కూడా కాపీ కథ అంటూ విమర్శలు వస్తున్నాయి. మరి ‘నా పేరు సూర్య’ చిత్రంతో కథా రచయితగా, దర్శకుడిగా వంశీ మంచి పేరు తెచ్చుకుంటాడా అనేది చూడాలి.