యనమల పన్ను’పోటు’ యమా రేటు గురూ…!

Rs 2.88 Lakh For AP Finance Minister Yanamala Ramakrishna Tooth Treatment

ఒక పక్క ఆంధప్రదేశ్ లోటు బడ్జెట్ లో ఉందంటూ ప్రభుత్వం గగ్గోలు పెడుతోంటే మరోపక్క అమాత్యులు మాత్రం ఎక్కడా తమ లెవల్ తగ్గకుండా చూసుకుంటున్నారు. ఏకంగా ఒక మంత్రి పంటి చికిత్సకు ఇప్పుడు లక్షలు ఖర్చు చేయడంపై సర్వత్రా విమర్శలు వెలువడుతున్నాయి. ఇండియాలో రూ.వేలల్లో అయ్యే రూట్ కెనాల్ చికిత్సకు మంత్రిగారు ఏకంగా సింగపూర్ వెళ్లి లక్షలు వెచ్చించడంపై నెటిజన్లు గడ్డి పెడుతున్నారు. ఆయన ఎవరో కాదు ఏపీ ప్రభుత్వం లో నెంబర్ 2 అయిన ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు.

ap finance minister
ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు గత ఏప్రిల్‌లో సింగపూర్‌లో పంటి చికిత్స చేయించుకున్నారు. ఆ బిల్లులను చంద్రబాబునాయుడు ప్రభుత్వం నిన్న విడుదల చేసింది. ఈ మేరకు జీవోను జారీచేసింది. ఐతే మంత్రి ఆరోగ్య చికిత్స ఖర్చులను ప్రభుత్వమే పెట్టుకోవాలి కాబట్టి రేంబర్స్మెంట్ పద్దతిల్లో ఆ డబ్బును ప్రభుత్వం తిరిగి చెల్లించింది. ఇంత వరకు బాగానే ఉంది. ఐతే రూట్ కెనాల్‌కు ఏకంగా రూ.2.88 లక్షలు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడంపై ఏపీ రాజకీయాల్లో దుమారం రేగుతోంది.

Inline image

ఎందుకంటే సాధారణంగా రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్‌కు మన దగ్గర బాగా అయితే రూ.5వేల రూపాయలు ఖర్చవుతాయి. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో అయితే రూ. 10వేలకు వరకూ కావొచ్చు. కానీ యనమల రామకృష్ణుడికి ఏకంగా 2,88,223 రూపాయలు ఖర్చయ్యాయి. అంటే దాదాపు 30 రెట్లు ఎక్కువన్న మాట. అంతేకాదు మనదేశంలో ఎన్నో పేరుమోసిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఉన్నాయి. మరోపక్క అన్నిటిలోనూ దేశంతో పోటీపడుతున్నామని చెప్పే చంద్రబాబు పాలిస్తున్న రాష్ట్రంలో కూడా అత్యాధునిక సదుపాయాలతో కొలువు తీరిన డెంటల్ డాక్టర్లు ఉన్నారు. కానీ మంత్రి గారికి ఏమయిందో ఏమో సింగపూర్ ఫ్లైట్ ఎక్కి మరీ అక్కడ వైద్యం చేయించుకు వచ్చారు.

ap-finance-minister
మరోవైపు ప్రభుత్వం రీయింబర్స్ చేసిన నిధులు, ఆస్పత్రి చార్జీలకు పొంతన లేదు. ఆయన చికిత్స చేయించుకున్న అజూర్ డెంటల్ ఆస్పత్రి వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం రూట్‌ కెనాల్‌లో మూడు రకాలున్నాయి. ఇన్సిసర్‌కు రూ.31వేలు (450 డాలర్లు), ప్రిమోలార్‌కు రూ.52వేలు (750 డాలర్లు), మోలార్‌కు రూ.66వేలు (950 డాలర్లు)..! వీటిలో ఎక్కువ ధర కలిగిన మోలార్ చికిత్స చేయించుకున్నారనుకున్నా..రూ. 66వేలే ఖర్చవుతుంది. కానీ ప్రభుత్వం మాత్రం రూ. 2.88 లక్షలు చెల్లించింది. ఇది కూడా కేవలం వైద్యం ఖర్చులే కాక ఆయన ప్రయాణ, హోటల్ చార్జీలు అదనమనే విమర్శలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. రాష్ట్రవిభజన వలన నవ్యాంధ్ర ఇప్పటికే నిధులు కొరతతో ఇబ్బందులు పడుతోందని చెప్పుకొచ్చే ప్రభుత్వం ఉన్న నిధులను ఇలా పళ్ళు కట్టించుకోడానికి పీకించుకోడానికి వృథా చేస్తోందని జనాలు ఏకిపారేస్తున్నారు.