Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రారంభించటానికి ముందే ప్రాజెక్టు కూలిపోయింది. బీహార్ లో ఈ ఘటన జరిగింది. భాగల్పూర్ లోని కహల్ గావ్ దగ్గర ఇరిగేషన్ స్కీమ్ కింద ఘటేశ్వర్ పంత్ కెనాల్ ప్రాజెక్టు నిర్మించారు. దాదాపు రూ. 389.31 కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ను బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బుధవారం ప్రారంభించాల్సి ఉంది. అయితే ప్రారంభోత్సవానికి ఒక్కరోజు ముందు కెనాల్ గోడ కుప్పకూలింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం మేరకు నీరునింపడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
ప్రాజెక్టు పనులు పూర్తికావడంతో ప్రయోగాత్మకంగా నీటిని నింపారు. దీంతో నీటి ఉధృతి ఎక్కువై ప్రాజెక్టు వద్ద నిర్మించిన గోడ కొట్టుకుపోయింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నింపడం వల్లే కెనాల్ గోడ కూలిందని బీహార్ నీటివనరుల శాఖ మంత్రి లలాన్ సింగ్ చెప్పారు. ఈ అపశృతి కారణంగా ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని తెలిపారు. అటు ప్రాజెక్టు గోడ కూలిపోవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఖహల్ గాన్, ఎన్టీపీసీ టౌన్ షిప్ ప్రాంతాల్లోకి నీరుచేరింది. సామాన్యులతోపాటు ఖహల్ గాన్ సివిల్ జడ్జి, సబ్ జడ్జిల నివాసాలు కూడా నీటమునిగాయి. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కెనాల్ లో నీరు సేకరించి వ్యవసాయదారులకు అందించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. దీనిద్వారా బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు సాగునీటి సమస్య తీరుతుంది. సుదీర్ఘ కాలం పాటు అనేక వ్యయప్రయాసల కోర్చి బీహార్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మించింది. ప్రాజెక్టు ద్వారా భాగల్పూర్ లో 18,620 హెక్టార్లకు, జార్ఖండ్ లోని గోడ జిల్లాలో 22, 658 హెక్టార్లకు సాగు నీటి సదుపాయం కల్పించనున్నారు.