ఆర్టీసీ కారణంగా జరిగిన నష్టంపై అధికారులు నివేదిక ఇవ్వగా.. సమ్మె కారణంగా ఆర్టీసీ దాదాపు రూ. 150 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని.. పండుగ సీజన్లో కార్మికులు సమ్మెకు వెళ్లడం ఏంటని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం.కార్మికులు సమ్మెకు దిగడాన్ని అనాలోచిత చర్యగా కేసీఆర్ అభివర్ణించారు. చర్చల ప్రసక్తే లేదని.. గడువులోగా డ్యూటీలో చేరని వారిని తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశం లేదని కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది. కొత్త సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వాలని.. బస్సులను అద్దెకు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలని న్యాయస్థానం ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో సమ్మె అసంబద్ధమని.. అందుకే చర్చలు జరపడం లేదని కోర్టుకు తెలపాలని అధికారులకు కేసీఆర్ సూచించారు.సుమారు ఐదు గంటలపాటు సాగిన ఈ భేటీలో తెలంగాణ రాక ముందు ఆర్టీసీకి ప్రభుత్వాలు ఏం చేశాయి. వచ్చిన తర్వాత ఎంత మేర లబ్ధి చేకూరిందో కేసీఆర్ గణాకాంలతో సహా వివరించారని సమాచారం.
రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆర్టీసీ కార్మికులకు 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామని, 16 శాతం ఐఆర్ ఇచ్చామని.. సంస్థ కోసం 3300 కోట్లు సాయం చేశామని.. కానీ ఆర్టీసీ లాభాల బాట పట్టలేదని కేసీఆర్ చెప్పారట. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం సాధ్యం కాదని సీఎం స్పష్టం చేశారని సమాచారం.ఆర్టీసీకి కొత్త ఎండీని నియమించడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదని కూడా కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది. కానీ ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు అకున్ సబర్వాల్, స్టీఫెన్ రవీంద్ర, ప్రవీణ్ కుమార్‌లను అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశించినట్టు తెలుస్తోంది.
చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా లేకపోతే.. ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ఆమె ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలను కలిసొచ్చారు. ఆర్టీసీ ఆస్తులు, పెట్రోల్ బంకులను అధికార పార్టీ నేతలు తమకు అనుకూలంగా మలుచుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వ్యవహారంలోనూ గవర్నర్ జోక్యం చేసుకుంటారని ప్రచారం జరుగుతోంది.