రష్యా 50 ఏళ్ల తర్వాత ‘లూనా-25’ ప్రయోగం.

Russia launches 'Luna-25' after 50 years
Russia launches 'Luna-25' after 50 years

రష్యా దాదాపు 50 ఏళ్ల తర్వాత జాబిల్లిపై ప్రయోగానికి సన్నద్ధమైంది. ఆగస్టు 11న ఆ దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్‌ కాస్మోస్‌.. చంద్రుడిపైకి ల్యాండర్‌ను పంపనుంది. మాస్కోకు తూర్పున 3,450 మైళ్ల దూరంలోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్‌ ప్రాంతంలోఈ ప్రయోగం జరగనుంది. సొయుజ్‌-2 ఫ్రిగట్‌ బూస్టర్‌ను మోసుకుని లూనా-25 ఆ రోజు నింగిలోకి దూసుకెళ్లనుంది.
ఈ ప్రయోగంలో రాకెట్‌ బూస్టర్లు.. ల్యాండర్‌ నుంచి విడిపోయిన తర్వాత భూమిపైనే పడనున్నాయి. ఇందుకోసం రష్యా ఓ గ్రామాన్ని ఖాళీ చేయిస్తోంది. రష్యా 1976 తర్వాత చేపడుతున్న తొలి లూనార్‌ ల్యాండర్‌ ప్రయోగం ఇది. తొలిసారి జాబిల్లిపై దక్షిణ ధ్రువంలో దీన్ని ల్యాండ్‌ చేసేలా రూపొందించారు. చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ టెక్నాలజీస్‌ అభివృద్ధి, జాబిల్లి ఉపరితలంపై పరిశోధనలు, అక్కడి వనరుల జాడను గుర్తించేందుకు ఈ ప్రయోగం చేపడుతున్నట్లు రోస్‌కాస్మోస్‌ వెల్లడించింది.

లూనా-25 కేవలం ల్యాండర్‌ మిషన్‌ మాత్రమే. కేవలం 30 కేజీల పేలోడ్‌ను మోసుకెళ్తోందని రష్యా శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందులో చంద్రుడిపై మట్టి ఆనవాళ్లను సేకరించేందుకు అవసరమయ్యే డ్రిల్లింగ్‌ హార్డ్‌వేర్‌, రోబోటిక్‌ చేతులతో పాటు ఇతర శాస్త్రీయ పరికరాలను దీంతోపాటు పంపించనున్నట్లు వెల్లడించారు.