Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సంయమనంతో వ్యవహరించాల్సిన అమెరికా, ఉత్తరకొరియా పరస్పరం రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడాన్ని రష్యా తప్పుబట్టింది. అమెరికా అద్యక్షుడు ట్రంప్, ఉత్తరకొరియా అధినేత కిమ్ ల గొడవ నర్సరీ పిల్లల పోరాటంలా ఉందని రష్యా విమర్శించింది. ఇరు దేశాల మధ్య విభేదాలు తగ్గటానికి సంయమనం అవసరమని రష్యా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సెర్గీలావ్ రోవ్ అభిప్రాయపడ్డారు. ఉత్తరకొరియా, అమెరికా తీరు కిండర్ గార్డెన్ పిల్లల యుద్ధాన్ని తలపిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఈ అంశంలో రష్యా వైఖరి ఎలాఉంటుందో ఆయన స్పష్టంచేశారు.
ఉత్తరకొరియా అణుకార్యక్రమాలను చూస్తూ ఊరుకోబోమని, అలాగని ఆ దేశంపై యుద్దమే సరైన మార్గమన్నా అంగీకరించబోమని సెర్గీలావ్ తేల్చిచెప్పారు. ఐక్యరాజ్యసమితి స్ఫూర్తికి అనుగుణంగా దీనికి రాజకీయపరిష్కార మార్గం కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చేందుకు చైనాతో కలిసి ఆచరణాత్మక విధానాలతో ముందుకు వెళ్తామని, భావావేశానికిలోనై ఎవరూ నిలువరించని కిండర్ గార్డెన్ పిల్లల్లా పోరాటానికి దిగబోమని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలపై స్పందిస్తూ…
ఐక్యరాజ్యసమితిలో ట్రంప్ ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తామని హెచ్చరించడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగింది. ట్రంప్ కు మతిభ్రమించిందని, వృద్ధాప్యం కారణంగా మతితప్పిందని కిమ్ జాంగ్ ఉన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దానికి స్పందిస్తూ ట్రంప్ కిమ్ ను పిచ్చోడిగా అభివర్ణించారు. అంతేకాకుండా గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర పరిణామాలను కిమ్ ఎదుర్కోబోతారని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో స్పందించిన రష్యా ఇరు దేశాధినేతల వైఖరిని తప్పుబట్టింది.