ఆగస్ట్ 30న సాహో

saaho release date fixed

ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సాహో. సుజీత్ దర్శకుడు. యు.వి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్నారు. శ్రద్ధాకపూర్ కథానాయిక. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ తొలుత ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న రిలీజ్ చేయాలనుకున్నాం. అయితే ప్రతి అంశంలో ప్రేక్షకులకు అత్యున్నత వీక్షణానుభూతిని అందించాలనే సంకల్పంతో విడుదల తేదీని మార్చడం జరిగింది. నాణ్యతాపరంగా ఎక్కడా రాజీలేకుండా ఉన్నత సాంకేతికతతో చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలతో పోరాట ఘట్టాలు, గ్రాఫిక్స్‌కు రూపకల్పన చేస్తున్నాం. ఈ అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని సినీ ప్రేమికులకు ఉత్తమ చిత్రాన్ని అందించాలనే లక్ష్యంతో ఆగస్ట్ 30న విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం అన్నారు.

జాకీష్రాఫ్, నీల్‌నితిన్ ముఖేష్, అరుణ్‌విజయ్, లాల్, వెన్నెల కిషోర్, ప్రకాష్ బెల్యాది, ఎవిలిన్‌శర్మ, చుంకీపాండే, మందిరాబేడీ, మహేష్ మంజ్రేకర్, టిను ఆనంద్, శరత్‌లోహితష్వా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మది, ఆర్ట్: సాబుసిరిల్, ఎడిటర్: శ్రీకర్‌ప్రసాద్, నేపథ్య సంగీతం: జిబ్రాన్, రచన-దర్శకత్వం: సుజీత్.