సుప్రీంకోర్టు తీర్పుతో శబరిమల ఆలయంలోకి ప్రవేశించాలన్న మహిళల ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది. నేడు తెల్లవారుజామున ఇద్దరు మహిళలు అయ్యప్ప సన్నిధానంలోకి ప్రవేశించి దర్శనం చేసుకుని చరిత్రలో నిఇచారు. బిందు, కనకదుర్గ అనే 50 ఏళ్ల లోపు మహిళలు ఇద్దరు పోలీసులు, బద్రతా దళాల అండతో శబరిమల ఆలయానికి చేరుకున్నారు. నల్ల రంగు దుస్తులు ధరించి అత్యంత రహస్యంగా కట్టుదిట్టమైన భద్రత నడుమ పంబ నుంచి శబరిమలకు చేరారు. అయితే దర్శనం చేసుకుని వస్తున్న ఈ మహిళల రాకను గమనించిన భక్తులు ఆందోళన చేపట్టారు. పంబా బేస్ క్యాంప్‌నకు అర్ధరాత్రి చేరుకున్న ఈ మహిళలు, తెల్లవారుజామున 3.45 గంటలకు సన్నిధానంలో ప్రవేశించి, స్వామిని పూజించినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ సమయంలో భక్తులు కూడా పరిమితంగా ఉన్నారని, మీడియా ప్రతినిధులు కూడా లేరని అంటున్నాయి.
ఈ విషయాన్ని దర్శనం చేసుకున్న మహిళలు, సీఎం విజయన్ ద్రువీకారించారు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో పంబకు చేరుకున్నామని అక్కడి నుంచి ఎలాంటి పోలీసు భద్రత లేకుండానే సన్నిధానానికి వచ్చి, 18 మెట్లు ఎక్కి అయ్యప్ప దర్శనం చేసుకున్నామని, మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేదని, కొందరు భక్తులు ఉన్నప్పటికీ ఎవరూ మమ్మల్ని ప్రశ్నించలేదని వారు చెబుతున్నారు. వీరిద్దరూ హడావుడిగా శబరిమల ఆలయంలోకి వెళ్తున్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆలయంలోకి ప్రవేశించిన ఇద్దరు మహిళలూ గత డిసెంబరు చివరిలో శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, భక్తులు వీరిని అడ్డుకోవడంతో వెనుదిరిగారు. దీనిపై అయ్యప్ప ధర్మసేన నేత రాహుల్ ఈశ్వరన్ మాట్లాడుతూ.. ఇది నమ్మశక్యంగా లేదని, అత్యంత రహస్యంగా మహిళలను ఆలయానికి తీసుకొచ్చారని అన్నారు.
దీనిపై నిర్దరణకు వచ్చాక అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యానించారు. అయితే నిషేధిత వయసు మహిళల ప్రవేశంతో ఆలయ పవిత్ర దెబ్బతిందని పూజార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాన్ని మూసివేసి సంప్రోక్షణ నిర్వహిస్తామని శబరిమల తంత్రీ వెల్లడించారు. దీంతో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేసి, సంప్రోక్షణ చేపట్టారు. ఇక మరోపక్క కేరళ ప్రభుత్వం మంగళవారం నిర్వహించిన మహిళల మానవహారంలో ముస్లింలు, క్రైస్తవులు పాల్గొన్న విషయం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో పెను దుమారమే రేగుతోంది. తమ సమస్యలకే సరైన పరిష్కారం కనుగొనలేని ఈ మతాల వారు, మూడో మతం మహిళల ఆలయ ప్రవేశం కోసం వీధుల్లోకి వచ్చి పోరాటం చేయడం సిగ్గుచేటని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.