చంద్రయాన్-3ని జాబిల్లి దక్షిణ ధ్రువంపైకి పంపించి.. ఆ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర లిఖించింది. ఇందుకోసం ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది. ఎన్నో ఏళ్లు కష్టపడి తక్కువ బడ్జెట్‌తో విజయవంతమైన చంద్రయాన్-3ని ప్రాజెక్టును ఈ ఏడాది ఆగస్టు 23వ తేదీన నింగిలోకి పంపింది. ‘విక్రమ్ ల్యాండర్’, ‘ప్రజ్ఞాన్ రోవర్’ల సాయంతో విజయవంతంగా చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు ద్వారా చంద్రుడి గురించి ఇస్రో చాలా విషయాలు సేకరించింది.
ఇక ఇప్పుడు చంద్రయాన్-3 ప్రాజెక్ట్‌లో మరో కీలక అడుగు ముందుకు పడింది. తాజాగా ఇస్రో, జాబిల్లి వద్దకు పంపిన ప్రొపల్షన్ మాడ్యూల్‌ను విజయవంతంగా చంద్రుడి కక్ష్య నుంచి భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇది ప్రత్యేక ప్రయోగమని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారు. చంద్రుడిపై నుంచి నమూనాలు సేకరించే ప్రణాళికలు చేస్తున్నామని.. తాజా ప్రయోగం ఆ మిషన్‌కు దోహదపడుతుందని తెలిపారు. నమూనాలను తీసుకొని తిరిగి వచ్చే మిషన్ కోసం వ్యూహాలు రూపొందించేందుకు ప్రొపల్షన్ మాడ్యూల్‌లోని అదనపు సమాచారం ఉపయోగపడుతుందని వెల్లడించారు.