హాల్‌ ఆఫ్ ఫేమ్‌.. స‌చిన్ టెండూల్క‌ర్‌కు అరుదైన గౌర‌వం

sachin tendulkar inducted in icc hall of fame

మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఐసీసీ హాల్‌ ఆఫ్ ఫేమ్‌లో స‌చిన్‌కు చోటు ద‌క్కింది. లండ‌న్‌లోని మేడ‌మ్ టుస్సాడ్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో స‌చిన్‌ను స‌న్మానించారు. సౌతాఫ్రికా పేస్ బౌల‌ర్ అల‌న్ డోనాల్డ్‌తో పాటు స‌చిన్‌కు ఈ గౌర‌వం ద‌క్క‌డం విశేషం. ఆస్ట్రేలియా మ‌హిళా క్రికెట‌ర్ క్యాథ‌రిన్ ఫిజ్‌ప్యాట్రిక్ కూడా హాల్‌ ఆఫ్ ఫేమ్‌లో చోటు ద‌క్కించుకున్న‌ది. క్రికెట్ ఆట‌కు వ‌న్నె తెచ్చిన మ‌హాక్రీడాకారుల‌కు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు క‌ల్పిస్తారు. అవార్డు అందుకున్న త‌ర్వాత స‌చిన్ మాట్లాడాడు. హాల్ ఫ‌మ్ ఫేమ్‌లో చోటు ద‌క్క‌డం గౌర‌వంగా భావిస్తున్న‌ట్లు టెండూల్క‌ర్‌ చెప్పాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో స‌చిన్‌కు ప్ర‌త్యేక స్థానం ఉంది. అత్యుత్త‌మ క్రికెట‌ర్‌గా అత‌నికి గుర్తింపు ఉన్న‌ది. ఆస్ట్రేలియాకు చెందిన స‌ర్ డాన్ బ్రాడ్‌మాన్‌తో అత‌న్ని పోలుస్తారు. టెస్టులు, వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన క్రికెట‌ర్‌గా స‌చిన్‌కు రికార్డు ఉంది. అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి స‌చిన్ మొత్తం 34 వేల 357 ర‌న్స్ చేశాడు. దాంట్లో మొత్తం వంద సెంచ‌రీలు కూడా ఉన్నాయి. సౌతాఫ్రికాకు చెందిన 52 ఏళ్ల అల‌న్ డోనాల్డ్ 2003లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అత‌ని ఖాతాలో 330 టెస్టు, 272 వ‌న్డే వికెట్లు ఉన్నాయి.