Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
క్రికెట్ అనేది సమిష్టి ఆట. తుది జట్టులోని పదకొండు మంది కలిసికట్టుగా ఆడితేనే గెలుపు దక్కుతుంది. ఎవరి ఆట వారు ఆడుకుంటే… వ్యక్తిగత రికార్డులు నమోదవుతాయేమో కానీ జట్టుమాత్రం ఓటమి పాలవుతుంది. కానీ విదేశీ క్రికెటర్ల సంగతి పక్కన పెడితే… భారత్ విషయం వచ్చేసరికే ఇక్కడి ఆటగాళ్లు రికార్డుల కోసమే ఆడతారు అనే ఒక అపప్రధ ఉంది. జట్టు ప్రయోజనాల కోసం సెంచరీ చేసే అవకాశాన్ని త్యాగం చేసే ఆటగాళ్లు భారత క్రికెట్లో అంతగా కనిపించరు అనే వాదనా వినిపిస్తుంటుంది. అందరూ మాస్టర్ బ్లాస్టర్ గా కీర్తించుకునే సచిన్ విషయంలో అయితే ఈ విమర్శలు కాస్త ఎక్కువ మోతాదులోనే వినిపిస్తాయి. క్రికెట్ లో సచిన్ మేరునగధీరుడైనప్పటికీ… వ్యక్తిగత రికార్డుల కోసం జట్టు ప్రయోజనాలు పట్టించుకోడన్నది సచిన్ పై ప్రధానంగా వచ్చే విమర్శ. దానికి తగ్గట్టుగా… చాలా మ్యాచ్ ల్లో సచిన్ సెంచరీ చేసినప్పుడు భారత్ ఓటమిపాలయ్యేది. దీనితో ఈ విమర్శలు మరింత ఎక్కువయ్యేవి. అనేక సందర్భాల్లో సచిన్ వీటిపై ఆగ్రహం వ్యక్తంచేసినప్పటికీ… ఇలాంటి విమర్శలు వినపడుతూనే ఉండేవి.
సచిన్ పై ప్రధానంగా వచ్చే మరో విమర్శ… బ్యాటింగ్… 90 దాటగానే… సెంచరీ కోసం నెమ్మదిగా ఆడుతూ బాల్స్ వృథా చేస్తాడని. అలా సచిన్ ఎక్కువ బాల్స్ ఎదుర్కొంటూ పరుగులు తీయకపోవడం వల్ల జట్టు చేయాల్సిన స్కోరు కన్నా… తక్కువ నమోదు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ సచిన్ కీర్తి కిరీటాల ముందు ఈ విమర్శలను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. నిజానికి సచిన్ అనే కాదు… ఎంతోమంది ఆటగాళ్లు ఇలా వ్యక్తిగత రికార్డులే లక్ష్యంగా ఆడతారనే విమర్శ ఉంది. అలాగే రాహుల్ ద్రావిడ్ వంటి ఆటగాళ్లు జట్టు ప్రయోజనాల కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతారన్న ప్రశంసలూ ఉన్నాయి. ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ద్రవిడ్ కోవకే చెందుతాడు.కెప్టెన్ గా అయినా, సాధారణ ఆటగాడిగా అయినా జట్టు ప్రయోజనాలకే కోహ్లీ అధిక ప్రాధాన్యం ఇస్తాడనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి.
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు లో కూడా కోహ్లీ మరోసారి ఇది నిరూపించాడు. డ్రాగా ముగిసిన తొలిటెస్టులో కోహ్లీ అద్వితీయ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. కోహ్లీ సెంచరీ పూర్తికాగానే భారత్ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. వెలుతురు లేమి కారణంగా అంపైర్లు మ్యాచ్ నిలిపివేయడంతో భారత్ గెలుపు ఖాయమనుకున్న టెస్టు చివరికి డ్రా అయింది. అయితే విరాట్ సెంచరీ ముగిసే దాకా ఉండకుండా ముందుగానే భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసుంటే… గెలిచుండేదన్న విమర్శలు వినిపించాయి. అయితే అందరూ అనుకున్నట్టు సెంచరీ పూర్తిచేసేదాకా ఆడాలన్న నిర్ణయం కోహ్లీది కాదు. తాను 97 పరుగుల వద్ద సెంచరీకి అతిచేరువలో ఉన్నప్పుడే గెలుపుపై కన్నేసిన కోహ్లీ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసేందుకు సిద్ధపడ్డాడు. స్టాండ్స్ లో కూర్చుని మ్యాచ్ చూస్తున్న కోచ్ రవిశాస్త్రిని డిక్లేర్ చేయాలా అని సైగచేసి అడిగాడు కూడా. అయితే డిక్లేర్ చేయవద్దని, బ్యాటింగ్ కొనసాగించాలని రవిశాస్త్రి సూచించాడు. అలా కోహ్లీ… కెప్టెన్ హోదాలో ఉండి కూడా మ్యాచ్ గెలుపు కోసం సెంచరీ చేరువలో ఇన్నింగ్స్ డిక్లేర్ చేయాలనుకున్న విషయం తెలిసీ అందరూ ఆశ్చర్యపోతున్నారు. కోహ్లీ నిబద్ధతపై ఇప్పుడు సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.