స్వచ్చతా హీ సేవాలో పాల్గొనాల్సిందిగా ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపుకు సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్వచ్చతా హీ సేవాకు పూర్తిమద్దతు ప్రకటించగా…తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్వయంగా స్వచ్చతా హీ సేవాలో పాల్గొని వీధులను శుభ్రం చేశారు. తద్వారా మోడీ కోరుకున్నట్టుగా ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. ప్రధాని కోరిన వెంటనే స్వచ్ఛతా హీ సేవాకు మద్దతు తెలిపాడు సచిన్..అక్టోబరు 2తో ఈ కార్యక్రమం ముగియనుండడంటో..స్వయంగా చీపురు పట్టి వీధులు శుభ్రపరిచాడు. పశ్చిమ బాంద్రాలోని వీధులను శుభ్రం చేసిన సచిన్…తామంతా కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నామని, మీరు కూడా మీ స్నేహితులతో కలిసి వీధులను శుభ్రం చేయాలని అభిమానులకు పిలుపునిచ్చాడు.
స్వచ్ఛతా హీ సేవా ప్రారంభించిన వెంటనే మోడీ దేశంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు లేఖలు రాశారు. స్వచ్చందంగా స్వచ్చతా హీ సేవాలో సెలబ్రిటీలు పాల్గొని…ప్రజలకు స్ఫూర్తినివ్వాలని కోరారు. అందుకు తగ్గట్టుగానే… కొందరు సెలబ్రిటీలు పరిశుభ్ర కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా అభిమానులను కోరుతున్నారు. అటు సచిన్ ను ప్రధాని మోడీ ప్రశంసల్లో ముంచెత్తారు. స్వచ్ఛతా హీ సేవాలో పాల్గొనడం ద్వారా దేశంలో ఎంతోమందికి ఆయన స్ఫూర్తిగా నిలిచారని ట్విట్టర్ లో కొనియాడారు. ఒక్కరే పరిశుభ్ర భారత్ ను తయారుచేయలేరని, యువత, ప్రజలు కలిసి రావాలని కోరారు. దేశపౌరులంతా…తమ స్నేహితులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.