Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సదావర్తి భూముల వేలం ప్రక్రియ పూర్తి అయ్యింది. ఆ భూములకు 60 కోట్ల ధర లభించింది. దీంతో ఒకప్పుడు ప్రభుత్వం ఈ భూముల్ని కేవలం 22 కోట్ల పైచిలుకు ధరకే కట్టబెట్టిందని వైసీపీ అనుకూల వర్గాలు విమర్శిస్తున్నాయి. చంద్రబాబు సర్కార్ నిర్ణయం వల్ల దాదాపు 38 కోట్ల రూపాయలు నష్టం ప్రభుత్వానికి వాటిల్లిందని వైసీపీ నాయకుల ఆరోపణ. ఈ ఆరోపణల్ని టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు. గడిచిన ఏడాదిలో ధరల పెరుగుదలకు తగ్గట్టు రేటు పెరిగింది తప్ప ఇందులో అవినీతికి ఆస్కారం ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్నారు. అంతే గాకుండా తాజా వేలంపాటకి సంబంధించి కూడా కొన్ని ఆసక్తికర విషయాలు బయటికి తెస్తున్నారు.
వేలం పాటలో సదావర్తి భూములు దక్కించుకున్న సత్యనారాయణ రెడ్డి ప్రొద్దుటూరు కి చెందిన వైసీపీ నాయకుడని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పైగా ఇదంతా జగన్ ఆడిస్తున్న నాటకమని, సర్కార్ మీద విమర్శల కోసమే ఎక్కువ ధర పెట్టి ఆ భూములు కొన్నారని కూడా దేశం నాయకులు అంటున్నారు. ఒకప్పుడు ఇదే వైసీపీ నాయకులు, సాక్షి పత్రిక కలిసి 1000 కోట్ల రూపాయల విలువైన భూమిని కేవలం 22 కోట్లకు కట్టబెట్టారని, దీని వల్ల ప్రభుత్వానికి 980 కోట్ల దాకా నష్టమని అప్పట్లో సాక్షి పత్రిక కోడై కూసింది. ఇప్పుడు తాజా వేలం తర్వాత దక్కింది కూడా 60 కోట్లు మాత్రమే. అంటే ఒకప్పుడు సాక్షి చెప్పింది నిజం అయితే ఇప్పుడు వైసీపీ నేత సత్యనారాయణరెడ్డి కి 940 కోట్ల లాభం. ఈ ఆరోపణ తప్పు అయితే సాక్షి చేసింది తప్పుడు ప్రచారం.