టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేసిన ‘బాహుబలి’ చిత్రం ఏ రేంజ్‌లో విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో అతి పెద్ద భారీ బడ్జెట్ చిత్రంగా ఇప్పటి వరకు ఈ చిత్రం రికార్డును దక్కించుకుంది. అయితే బాహుబలి రికార్డును ‘సాహో’ క్రాస్ చేసేలా ఉంది అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా అవ్వడం వల్ల సాహోపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే యూవీ క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్నారు. దర్శకుడు కొత్తవాడు అయినా కూడా నిర్మాతలు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. షూటింగ్ ఇప్పటి వరకు 30 శాతం పూర్తి అయ్యిందో లేదో అప్పుడే 130 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లుగా సమాచారం అందుతుంది.
సినిమా ఇంకా షూటింగ్ 70 శాతం మిగిలి ఉంది. ఈ 70 శాతంకు కనీసం 150 కోట్ల వరకు అయినా ఖర్చు అవుతుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అయితే షూటింగ్‌లో ఎక్కడ రాజీ పడకుండా భారీతనంతో చిత్రాన్ని నిర్మిస్తున్నారు కనుక 150 కోట్లు కాస్త 200 కోట్లు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు. సినీ విశ్లేషకులు ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెట్టుకున్నారు. తెలుగుతో పాటు తమిళం మరియు హిందీల్లో కూడా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అన్ని భాషల్లో విడుదల చేయడం వల్ల ఎంత బడ్జెట్ పెట్టినా తిరిగి వస్తుందనే నమ్మకంతో యూవీ నిర్మాతలు ఉన్నారు. అయితే బాహుబలి వంటి సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టినా పర్వాలేదు కాని, సాహో వంటి చిత్రానికి మాత్రం కాస్త చూసి బడ్జెట్‌ను ఖర్చు చేయాలి అంటున్నారు.