Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఈ మధ్యే సమంత ని పెళ్ళాడి ఓ ఇంటికి అల్లుడైన నాగచైతన్య త్వరలో శైలజారెడ్డి కి అల్లుడు కాబోతున్నాడు. అయితే పెద్దగా ఆశ్చర్యపడాల్సిన పనేమీ లేదు. ఎందుకంటే… ఇదంతా జరుగుతోంది ఓ సినిమా వ్యవహారంలో మాత్రమే. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద మారుతి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా చేస్తున్న సినిమాకి శైలజారెడ్డి అల్లుడు అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. తెలుగు సినిమాల్లో పొగరుబోతు అత్త ని దారికి తెచ్చే అల్లుడి కధలు చాలా వచ్చాయి. నాటి గుండమ్మ కథ నుంచి ఇప్పటిదాకా ఇలా వచ్చిన కధలు చాలా హిట్ అయ్యాయి. అయితే ఈ మధ్య అలాంటి కధలు రాలేదు. వచ్చినా ఆ స్థాయి టాలెంట్ వున్న అత్త ఎవరూ దర్శకులకి దొరకలేదు. బాహుబలి లో రమ్యకృష్ణ ని చూసాక దర్శకుడు మారుతి ఆమెలో శైలజారెడ్డి ని గుర్తించాడట.
రమ్యకృష్ణ ఇంతకుముందు నా అల్లుడు సినిమాలో ఇలాంటి అత్త పాత్ర వేసినా ఆ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో ఆమెని మళ్ళీ అలాంటి పాత్రతో ఎవరూ అప్రోచ్ కాలేదు. అయినా ఆమెకి కథ నచ్చలేదు. ఇప్పుడు మారుతి చెప్పిన కథతో రమ్యకృష్ణ కన్విన్స్ అయ్యి సినిమాకి ఓకే చెప్పారు. టైటిల్స్ లో కులం పేరు ధ్వనించేలా పెట్టడం కొత్తేమీ కాదు. అయితే రెడ్డి పేరు పెట్టడం మాత్రం కాస్త తక్కువే. అప్పుడెప్పుడో సమరసింహారెడ్డి తర్వాత మధ్యలో ఒకటి రెండు సినిమాలకి రెడ్డి పేరు వచ్చింది. అయితే ఈమధ్య వచ్చిన అర్జున్ రెడ్డి సక్సెస్ తో టైటిల్ లో రెడ్డి పేరు ఉండటం క్రేజీగా మారింది. ఆ కోవలో ఇప్పుడు శైలజారెడ్డి అల్లుడు టైటిల్ వైపు మారుతి టీం ఆలోచించడం ఆసక్తి రేపుతోంది.