Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
క్రీడాభిమానులకు ముఖ్యంగా బ్యాడ్మింటన్ ప్రేక్షకులకు ఆదివారం ఆసక్తికర పోరు చూసే అవకాశం వచ్చింది. కామన్ వెల్త్ గేమ్స్ లో భాగంగా మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ లో భారత స్టార్ క్రీడాకారిణులు హోరాహోరీ తలపడనున్నారు. సైనా నెహ్వాల్, పి.వి.సింధు సెమీఫైనల్స్ లో ప్రత్యర్థులను ఓడించడంతో… ఫైనల్లో వారిద్దరూ తలపడాల్సి వస్తోంది. ఎవరు గెలిచినా, ఓడినా వారికి పతకాలు ఖాయం. అయితే ఫైనల్లో గెలిచినవారికి స్వర్ణం, ఓడిన వారికి రజతం లభిస్తాయి. మరి స్వర్ణం సైనాకు దక్కుతుందా… సింధు చేజిక్కించుకుంటుందా… అని అభిమానులంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఫైనల్లో అభిమానుల ఆసక్తి సైనా, సింధుపైనే కాదు… వారి కోచ్ పుల్లెల గోపీచంద్ పై కూడా. సైనా, సింధు ఇద్దరూ గోపీచంద్ అకాడమీ ద్వారా వెలుగులోకి వచ్చిన వారే. వారిద్దరూ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిలుగా ఎదగడంలో గోపీచంద్ పాత్ర కీలకం. ఇద్దరూ ఆయనకు శిష్యురాళ్లే. మరి ఫైనల్ లో గోపీచంద్ ఎవరికి సలహాలు ఇచ్చి గెలిపిస్తాడో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.