“ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చూరులో చుట్ట కాలి ఇంకొకడు ఏడిచాడంట”… ఈ సామెత వినడానికి కాస్త మొరటుగా వున్నా ఏ పరిణామాన్ని అయినా ఎవరికి ఏది అవసరమో ఆ కోణంలోనే చూస్తారు అనడానికి ఇలా చెప్పారు. ఈ నానుడిని నిజం చేసింది వైసీపీ అధినేత జగన్ మానసపుత్రిక సాక్షి పత్రిక. అజ్ఞాతవాసి సినిమా బాగాలేదని పవన్ ఫాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు. ఈ విషయం మీద డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పనితీరు మీద వాళ్లంతా ఫుల్ గా ఫైర్ అయిపోతున్నారు. అంతటి మేధావి ఇలాంటి సినిమా తీశాడేంటి అని వాళ్ళు ఫీల్ అవుతుంటే సాక్షి పత్రిక మాత్రం అజ్ఞాతవాసి ఫెయిల్యూర్ కి కారణం కనిపెట్టేసింది. ఇప్పటి అజ్ఞాతవాసి ఫెయిల్యూర్ తో పాటు పవన్ కళ్యాణ్ నటించిన గోపాలగోపాలా, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు కూడా ప్లాప్ అయ్యాయని తేల్చేసిన సాక్షి అందుకు భలే కారణం చెప్పింది.
అత్తారింటికి దారేది సినిమా హిట్ అయ్యాక పవన్ సినిమాలు హిట్ కాకపోవడానికి సాక్షి చెప్పిన కారణం వింటే మోకాలికి, బట్ట తలకు ముడి వేయడం అంటే ఏంటో అరటి పండు వలిచి చేతిలో పెట్టినంత తేలిగ్గా అర్ధం అవుతుంది. యాదృచ్చికమే కావొచ్చు గానీ అంటూనే టీడీపీ ప్రభుత్వం వచ్చాక, జనసేన పార్టీ పెట్టాక పవన్ కళ్యాణ్ సినిమాలు హిట్ కావడం లేదని సాక్షి భాష్యం చెప్పింది. అంటే జగన్ కి నచ్చని ఆ రెండు విషయాలే పాపం పవన్ కళ్యాణ్ ప్లాప్స్ కి కారణం అని చెప్పడం చూస్తుంటే చిన్నపిల్లల మాటలు గుర్తుకు వస్తున్నాయి. సాక్షి చెబుతున్న దాని ప్రకారం ఈ సినిమాలు ప్లాప్ కావడానికి కధ, కధనాలు, దర్శకులు కారణం కానే కాదు. పవన్ ఫాన్స్ కోప్పడుతున్న త్రివిక్రమ్ తప్పు ఏమీలేదు. ఆయన సూపర్ సేఫ్. తప్పంతా ఆంధ్రప్రదేశ్ లో అధికారానికి వచ్చిన టీడీపీ ది, జనసేన ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ ది. ఈ రెండూ లేకుండా పోతే పవన్ సినిమాలు హిట్ అవుతాయా సాక్షి ? తెలుగులో జర్నలిజం విలువలు గురించి మాట్లాడుకునే రోజులు కావు ఇవి. అలాగని మరీ జనం పత్రికలు చూసి పిచ్చివాళ్ళని నవ్వుకోకుండా చూసుకుంటే మంచిది.