బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు ఎదురయ్యాయి. చావుకు వీసా అవసరం లేదు అంటూ దుండగులు సల్మాన్‌కు బెదిరింపు లెటర్ రాశారు. అయితే ఈసారి ఫేస్బుక్ మాధ్యమంగా ఈ వార్నింగ్ వచ్చింది. దీంతో ముంబయి పోలీసులు అప్రమత్తమయ్యారు. సల్మాన్‌ను అప్రమత్తం చేసి పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. భాయిజాన్‌కు మళ్లీ బెదిరింపులు రావడంతో ఆయన కుటుంబంతో పాటు అభిమానులు ఆందోళన కి గురిఅయ్యారు . ఆయన క్షేమంగా ఉండాలని ప్రార్థనలు చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే.. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరిట ఉన్న ఫేస్బుక్ అకౌంట్ నుంచి.. సల్మాన్ ఖాన్‌కు డెత్ థ్రెట్ వచ్చింది. భాయిజాన్‌తో పాటు ఈ పోస్టులో పంజాబీ సింగర్ జిప్పీ గ్రేవాల్‌కు కూడా వార్నింగ్ ఉంది. జిప్పీని ఉద్దేశిస్తూ.. “నువ్వు సల్మాన్ ఖాన్‌ను సోదరుడిగా భావిస్తావు. ఇప్పుడు నీ అన్న వచ్చి నిన్ను కాపాడాల్సిన సమయం వచ్చింది. ఈ మెసేజ్ నీకు మాత్రమే కాదు. సల్మాన్ ఖాన్‌కు కూడా. దావూద్ వచ్చి కాపాడతాడని ఊహల్లో ఉండకు. నిన్ను సేవ్ చేయడానికి ఎవరూ రారు. సిద్ధూ మూసేవాలా మరణంపై నువ్వు, ఎలా స్పందించావో మేము అందరం చూశాం. ఈ బెదిరింపు ట్రైలర్ లాంటిదే. అసలు సినిమా ముందుంది. నువ్వు ఏ దేశానికైనా వెళ్లు.. కానీ, మరణానికి వీసా అవసరం లేదు” అని పోస్టులో రాసి ఉంది. ఈ ఖాతాకు లారెన్స్ ఫొటోనే డీపీగా ఉందటంతో అది ఒరిజినల్ ఖాతానా లేక ఫేక్ అకౌంటా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.