Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు ప్రేక్షకులు మల్టీస్టారర్ చిత్రాలకు మొహం వాచి ఉన్నారు. ఎప్పుడెప్పుడు మల్టీస్టారర్ చిత్రాలు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. స్టార్ హీరోల మల్టీస్టారర్‌లు దాదాపు అసాధ్యం. కనీసం చిన్న హీరోల మల్టీస్టారర్‌లు అయినా వస్తే బాగుండు అని సాదారణ సినీ ప్రేక్షకుడు భావిస్తున్నాడు. సగటు ప్రేక్షకుడి కోరిక ‘శమంతకమణి’తో తీరబోతుంది. ఇద్దరు కాదు ముగ్గురు కాదు, ఏకంగా నలుగురు యువ హీరోలు ఈ మల్టీస్టారర్‌లో నటించారు. శ్రీరామ్ ఆధిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ మల్టీస్టారర్ చిత్రంపై ప్రేక్షకులు ఆసక్తిని కనబర్చుతున్నారు. సినీ వర్గాల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు శ్రీరాం ఆధిత్య ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా టీజర్ చూస్తేనే అర్థం అవుతుంది. ఈ చిత్రంలో నారా రోహిత్, సందీప్ కిషన్, ఆది, సుదీర్‌బాబులు హీరోలుగా నటించారు. రాజేంద్ర ప్రసాద్ ఒక ముఖ్య పాత్రలో నటించాడు. విభిన్న కథాంశంతో ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించాడట. తాజాగా టీజర్ మహేష్‌బాబు చేతుల మీదుగా విడుదలైంది. టీజర్‌లో నలుగురు హీరోల పరిచయం జరిగింది. ఇక సినిమాకు ముఖ్యమైన శమంతకమణి గురించి సస్పెన్స్ ఉంచారు. ఇంతకు శమంతకమణి అంటే అమ్మాయా లేక మరేదైనా వస్తువా అనే విషయమై సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ జనరేషన్‌లో వస్తున్న అతి పెద్ద మల్టీస్టారర్ చిత్రం అవ్వడంతో ఈ సినిమాపై అందరి దృష్టి ఉంది. టీజర్ చూస్తుంటే సినిమా మస్త్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని అనిపిస్తుంది. మరి అంచనాలను అందుకుంటుందా అనేది చూడాలి.