Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రేమోన్మాదం మరో యువతిని బలితీసుకుంది. ప్రేమించి దూరం పెట్టిందన్న కోపంతో కార్తీక్ అనే ప్రేమోన్మాది చేసిన దారుణం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. గతంలో ప్రేమోన్మాదులు కత్తులతో నరికితే.. కార్తీక్… అంతకన్నా దారుణంగా సంధ్యారాణి అనే యువతిని కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశాడు. మంటల్లో మానవత్వాన్ని తగులబెట్టాడు. తనది ప్రేమ కాదు ఉన్మాదం అని రుజువుచేశాడు. ప్రేమ అవతలివ్యక్తి సంతోషాన్ని, సుఖాన్ని కోరుకోవాలి కానీ..ఇటీవలి ప్రేమలు పగను, ప్రతీకారాన్ని కలుగజేస్తున్నాయి. మనుషుల్ని ఉన్మాదులుగా మారుస్తున్నాయి. నిజమైన ప్రేమకు అర్ధం తెలియకపోవడం, ప్రతికూల సినిమాలు, నేరవార్తల ప్రభావం సాధారణ యువకుల్ని క్రూరులుగా తయారుచేస్తున్నాయి. ప్రేమలో అంగీకారం ఎంత సాధారణమో, తిరస్కరణా అంతే. కానీ నేటి యువకులు ఈ తిరస్కరణ భావాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
కార్తీక్ ఉదంతం ఇదే తెలియజేస్తోంది. తాను సంధ్యారాణిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించానని, తరువాత కాదనడంతో తట్టుకోలేక ఈ దారుణానికి ఒడిగట్టానని పోలీసుల విచారణలో కార్తీక్ వెల్లడించడం చూస్తే…అతని ఆలోచనా విధానం ఏ స్థాయిలో ఉందో అర్ధంచేసుకోవచ్చు. సంధ్యపై కిరోసిన్ పోసి నిప్పటించిన వెంటనే కార్తీక్ తప్పించుకునే ప్రయత్నం చేయకుండా పోలీసులకు లొంగిపోవడం చూస్తుంటే అతను ఆవేశంతో కాకుండా…ముందుగా అనుకున్న ప్రణాళిక మేరకే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు స్పష్టమవుతోంది. పోలీసుల విచారణలో హత్యకు దారితీసిన కారణాలను అతను వెల్లడించాడు.
సంధ్యతో తనకు మూడేళ్ల నుంచి పరిచయం ఉందని, అయితే ఇటీవల కాలంలో ఆమె తనను దూరం పెట్టిందని చెప్పాడు. తనతో కలిసి పనిచేసే ఓ వ్యక్తితో సంధ్యారాణి ప్రేమలో పడడం వల్లే తనను దూరం పెట్టిందని, తనతో మాట్లాడడం మానేసిందని..దీంతో తాను ఎంతగానో కుమిలిపోయాయని కార్తీక్ చెప్పాడు. సంధ్యకు ఫోన్ చేస్తే అతనే లిఫ్ట్ చేసేవాడని, సంధ్య జోలికి రావద్దని బెదిరించాడని కార్తీక్ తెలిపాడు. తన పెరుగుతున్న అసహనానికి, ఉన్మాదానికి ఉదాహరణ. బాధితురాలు సంధ్యారాణి తల్లి సావిత్రి, సోదురులు, అక్కతో కలిసి లాలాగూడలో భజన సమాజంలో నివాసముంటోంది.
శాంతినగర్ లోని ఓ అల్యూమినియం దుకాణంలో పనిచేస్తోంది. పని పూర్తయ్యాక గురువారం సాయంత్రం 6.30 గంటలకు ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యంలో ఆశాకిరణ్ చిన్నారుల వసతి గృహం వద్దకు రాగానే కార్తీక్ సంధ్యారాణి వద్దకు వచ్చి గట్టిగా అరిచాడు. ఆమె స్పందించేలోపు చేతిలో ఉన్న సీసాలోని కిరోసిన్ ఆమె శరీరంపై పోసి నిప్పంటించాడు. మంటలకు తాళలేక సంధ్యారాణి కుప్పకూలిపోయింది. స్థానికులు ఆమెపై పాత దుస్తులు కప్పి మంటలు ఆర్పారు. అనంతరం గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూసింది. అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో సంధ్యారాణి చెప్పిన మాటలే ఈ కేసులో కీలక ఆధారం కానున్నాయి. తనపై కార్తీక్ కిరోసిన్ పోసి నిప్పంటించాడని చెప్పింది. తనకు నిప్పంటించే ముందు కార్తీక్ కాసేపు మాట్లాడాడని, బండిపై ఒక్కడే వచ్చాడని తెలిపింది. సంధ్య చివరి మాటల వీడియో నెట్ లో వైరల్ గా మారింది. అటు సంధ్య మృతితో కార్తీక్ పై పోలీసులు హత్యకేసు నమోదుచేశారు. వేధింపులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టి కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు తెలిపారు.