Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బాలీవుడ్ దృష్టి మొత్తం ఇప్పుడు సంజయ్ లీలా భన్సాలీ పద్మావతి పైనే ఉంది. చారిత్రక కథాంశంతో సినిమాలు తీయడం భన్సాలీకి కొత్త కాకపోయినా… చరిత్రలో చిత్తోర్ రాణి పద్మిణి జీవితకథపై ఉన్న అనేక వివాదాలు… పద్మావతి సినిమానూ ఆ దిశగా నడిపిస్తున్నాయి. సుల్తాన్ ల చరిత్రలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాలనకు ఎంత ప్రత్యేకత ఉందో… ఆయన జీవిత చరిత్రలో చిత్తోర్ రాణి పద్మిణికి అంత ప్రాధాన్యత ఉంది. ఖిల్జీ, పద్మిణి తమ జీవితకాలాల్లో ముఖాముఖి ఒక్కసారి కూడా కలుసుకోకపోయినా… వారి కథ, పద్మిణిపై ఖిల్జీకి ఉన్న ప్రేమ ఆధారంగా ఎన్నో పుస్తకాలు వచ్చాయి. నాటకాలూ ప్రదర్శితమయ్యాయి. అలాంటి ఓ నాటకం చూసే ఇన్పిరేషన్ పొందిన భన్సాలీ… పద్మిణిని తెరకెక్కించాలని ఎన్నో ఏళ్లనుంచి ఎదురుచూస్తున్నారు. ఇన్నేళ్లకు ఆ ప్రాజెక్టు పట్టాలెక్కింది.
అయితే సినిమా షూటింగ్ ప్రారంభమయిన మరుక్షణం నుంచి వివాదాలూ మొదలయ్యాయి. రాజ్ పుత్ వర్గానికి చెందిన రాణి పద్మిణి జీవితకథలో సినిమా కోసం మార్పులు చేస్తున్నారని వార్తలు రావడంతో ఆ వర్గం కస్సుమంది. ఖిల్జీ, పద్మిణి మధ్య ప్రేమ సన్నివేశాలు ఉంటాయన్న పుకార్లే రాజ్ పుత్ ల ఆగ్రహానికి కారణం. జీవితంలో ఒక్కసారి కూడా కలుసుకోని వారిద్దరి మధ్య ప్రేమ సన్నివేశాలు ఉన్నట్టు ఎలా తీస్తారని రాజ్ పుత్ లు భన్సాలీని ప్రశ్నిస్తున్నారు. రాజ్ పుత్ ల రాజసానికి, గౌరవానికి, హోదాకు ప్రతీకగా భావించే పద్మిణి వ్యక్తిత్వంపై మచ్చ పడేలా సినిమా ఉంటే ఊరుకోబోమని వారు మండిపడుతున్నారు. సినిమా విడుదలను అడ్డుకుంటామనీ హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భన్సాలీ స్పందించారు.
పద్మావతి సినిమాతో రాణి పద్మిణికి ఎలాంటి అవమానం జరగదని, ఎవరి మనోభావాలూ దెబ్బతినవని చెప్పారు. పద్మావతి సినిమాపై ఇప్పటివరకు వచ్చిన వార్తలన్నీ ఊహాగానాలు, పుకార్లు, వక్రీకరణలే అన్నారు. వివాదం కోసమో, ఎవరినో కించపరచాలనో సినిమా తీయటం లేదని, పద్మావతి గురించి తెలుసుకుని స్ఫూర్తి పొందానని తెలిపారు. అల్లావుద్దీన్ ఖిల్జీకి, పద్మావతికి మధ్య ప్రేమ సన్నివేశాలు లేవని భన్సాలీ తెలిపారు. తమ సినిమా రాణి పద్మావతి కీర్తి పెంచుతుందే కానీ, ఆమె ప్రతిష్టను దిగజార్చదని స్పష్టంచేశారు. మరోవైపు రాజ్ పుత్ లు గర్వంగా భావించే పద్మిణి అనే రాణే వారి చరిత్రలో లేదన్న వాదనలూ ఉన్నాయి. పద్మిణి అనే రాణి చరిత్రలో లేదని, రాజ్ పుత్ ల నమ్మకాల్లో మాత్రం సజీవంగా ఉందని ప్రముఖ చరిత్ర కారుడు గంగరాజు అన్నారు. పద్మిణి అనేది నవలా రచయిత ఊహల రాణి అని తెలిపారు.
కామాంధుడిగా పేరుపొందిన అల్లావుద్దీన్ ఖిల్జీ కి పద్మిణిని నేరుగా చూపించడం ఇష్టం లేక ఆమె వెనుతిరిగి ఉన్నప్పుడు అద్దంలో ఆమెను ఖల్జీ చూసినట్టు నవలలో ఉంటుందని గంగరాజు తెలిపారు. ఇదంతా ఊహాజనితమని, వాస్తవంలో అల్లావుద్దీన్ ఖిల్జీ మేవార్ పై దాడిచేసి రావల్ రతన్ సింగ్ ను ఓడించాడని, అతని భార్య కమలాదేవిని బందీగా తీసుకెళ్లి తన భార్యగా చేసుకున్నాడని చెప్పారు. ఖిల్జీకి పనిమనుషులు, బానిసలు అన్న తేడా లేదని, చాలామందితో లైంగిక సంబంధాలు ఉండేవని, ఇది చరిత్ర చెప్పిన సత్యమని గంగరాజు వివరించారు. ఉత్తరాదితో పాటు దక్షిణభారతదేశంపైనా ఖిల్జీ దండెత్తి అనేక రాజ్యాలు వశపరుచుకున్నాడు. అయితే చిత్తోర్ కోటపై ఖిల్జీ దాడికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. రాణి పద్మిణి అందచందాల గురించి విని, ఆమెను ఒక్కసారైనా చూడాలన్న కోరికతో ఖిల్జీ చిత్తోర్ పై దాడిచేశారని కొందరు చరిత్ర కారులు చెబుతారు. లైంగిక సంబంధాల గురించి పక్కనపెడితే ఖిల్జీ పరిపాలనలో మాత్రం నూతన పద్ధతులు ప్రవేశపెట్టి… ప్రజారంజకంగా పాలించారనే పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో భన్సాలీ… రతన్ సింగ్ ను కాకుండా ఖిల్జీని హీరోగా చూపించారన్న వాదనా… రాజ్ పుత్ ల ఆగ్రహానికి కారణమవుతోంది.