Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అక్రమాస్తుల కేసులో బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న చిన్నమ శశికళకు ఎట్టకేలకు పెరోల్ మంజూరైంది. అనారోగ్యంతో ఉన్న భర్తను చూసేందుకు 15 రోజుల పెరోల్ కావాలన్న శశికళకు జైళ్ల శాఖ కేవలం ఐదురోజుల పెరోల్ మంజూరుచేసింది. ఈ సమయాన్ని భర్తను చూసుకోవడానికి, వ్యక్తిగత పనులకోసం మాత్రమే కేటాయించాలని, ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లోనూ పాల్గొనకూడదని జైళ్ల శాఖ ఆదేశించింది. మీడియాకు ప్రకటనలు కూడా చేయరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే పెరోల్ రద్దు చేస్తామని హెచ్చరించింది. ఈ ఐదురోజులు శశికళ బంధువుల ఇంట్లో ఉండాలని సూచించింది.
ఫిబ్రవరిలో జైలుకెళ్లిన తర్వాత చిన్నమ్మ బయటికి రావడం ఇదే తొలిసారి. ఆమె జైలులో ఉన్న కాలంలో అన్నాడీఎంకె రాజకీయాలు అనూహ్య మలుపులు తిరిగాయి. రిసార్ట్ రాజకీయాలు నడిపి తన అనుచరుడు పళనిస్వామిని తమిళనాడు పీఠంపై కూర్చోబెడితే… ఆయన ప్రత్యర్థి పన్నీర్ సెల్వంతో చేతులు కలిపి ఆమెకు షాకిచ్చాడు. దీంతో పాటు అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి పదవినుంచి శశికళను తొలగించడమే కాకుండా… ఆమె వర్గానికి చెందిన దినకరన్ పైనా సస్పెన్షన్ వేటువేశారు.
ఈ పరిణామాలతో అన్నాడీఎంకెలో చిన్నమ్మ శకం ముగిసిందని అంతా భావించారు. ఇప్పుడు భర్త అనారోగ్యం పేరు చెప్పి పెరోల్ సంపాదించుకున్న శశికళ ఈ ఐదురోజుల కాల వ్యవధిలో అన్నాడీఎంకె రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి. జైళ్ల శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆమె బహిరంగంగా ఎలాంటి కార్యకలాపాల్లోనూ పాల్గొనలేకపోయినా… జయలలిత ఉన్నప్పటి లాగా తెర వెనక చక్రం తిప్పి… అన్నాడీఎంకె ను అదుపుచేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది