Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మ శశికళ ఖాళీ సమయాల్లో ఏం చేస్తున్నారు…? రాజకీయ, ఆర్థిక వ్యవహారాల్లో నిత్యం తలమునకలై ఉండే చిన్నమ్మకు జైల్లో ఎలా పొద్దుపోతోంది..? శశికళ అనుచరులు, అభిమానులకే కాదు… అందరికీ ఈ సందేహం ఉంది. దీనికి సంబంధించి ఓ ఆసక్తికరవిషయం బయటకువచ్చింది. శశికళ జైలులో విద్యార్థినిగా మారిపోయారు. రెండు కోర్సులు నేర్చుకుంటూ వాటిపై పట్టు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
పరప్పణ సెంట్రల్ జైలులో ఖైదీల కోసం ప్రత్యేకంగా అడల్ట్ లిటరసీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కన్నడ భాష రాయడం, చదవడం నేర్పిస్తున్నారు. ఈ తరగతులకు శశికళ కూడా హాజరవుతున్నారని జైలు అధికారులు చెప్పారు. ఇదే జైలులో ఉన్న శశికళ బంధువు జె. ఇళవరసితో కలిసి ఆమె కన్నడ నేర్చుకుంటున్నారు. అయితే శశికళకు కన్నడ మాట్లాడడం రాలేదు కానీ… బాగా చదవగలుగుతున్నారు. కన్నడతో పాటు కంప్యూటర్ క్లాసులకూ శశికళ హాజరవుతున్నారు. పుస్తకాలు చదవడానికి కూడా శశికళ ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటివరకు జైలులో కేవలం పురుషులకు మాత్రమే గ్రంథాలయం ఉండగా… త్వరలో మహిళల కోసం కూడా ప్రత్యేక లైబ్రరీ ఏర్పాటుచేయనున్నారు.